చిత్తూరు నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో గంగ జాతర జరగనుంది. ఈ క్రమంలో నగరమంతా సందడి మొదలైంది. పెద్దలు, యువకులు, భక్తులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏటా అంగరంగ వైభవంగా జరిగే గంగ జాతరను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు గంగ జాతరకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జాతరకు ముహూర్తం ఖరారుకావడంతో చిత్తూరు నగరంలోని నడివీధి, గిరింపేట, సంతపేట, కట్టమంచి, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లి, దొడ్డిపల్లి, మంగసముద్రం తదితర ప్రాంతాల్లోని వీధులు కళకళలాడుతున్నాయి. వారం రోజులుగా మండపాల నిర్మాణం, చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణల పనులు కొనసాగుతున్నాయి. ఈసారి జాతరలో తమ ప్రాంత మండపమే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు భారీగా ఖర్చు చేస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో మండపాలను అలంకరిస్తూ, భారీ విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో దారిపొడవునా చలువ పందిళ్లు వేస్తున్నారు. క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, విశ్రాంతి ఏర్పాట్లపైనా దృష్టి సారిస్తున్నారు. వర్షం పడినా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మండపాలను పటిష్టంగా నిర్మిస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లకు ఆర్డర్లు ఇచ్చారు. సౌండ్ సిస్టంలు, డప్పు వాయిద్యాలు, విద్యుత్ లైటింగ్, పుష్పాలంకరణలు, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర రోజుల్లో రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థానిక కళాకారులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలు, మహిళలు, యువత కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు.
కొంగారెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన మండపం
నడివీధిలో మండపం ఏర్పాట్లు
నిఘా నీడలో జాతర
గంగజాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే గుర్తించి నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు, శాంతిభద్రతల అంశాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అన్ని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గంగమ్మ కొలువుదీరే ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిఘా నీడలోనే ఉన్నాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు.


