చిత్తూరు రూరల్ (కాణిపాకం): హస్త కళాకారులకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఆమె శుక్రవారం చిత్తూరు మండలంలోని తుమ్మిందలో వినాయకుడి బొమ్మల తయారీని పరిశీలించారు. బొమ్మల తయారీ, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీపై ఆసక్తి ఉన్న కళాకారులకు యూనిట్ పెట్టించేలా చర్య లు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంలు సుబ్బారెడ్డి, విజయభాస్కర్, సీసీ నిత్యానంద పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సాంకేతిక సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఆయన శుక్రవారం ఆ సంఘ నాయకులతో కలిసి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ (డీజీఈ), ఐటీ అడిషనల్ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ టీచర్లు క్షేత్రస్థాయి లో సాంకేతికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. లీప్ యాప్ నిర్వహణలో ఇబ్బందులున్నట్లు తెలిపారు. టీచర్ల సర్వీసెస్ సెక్షన్‌లో ప్లే స్లిప్పుల మాదిరిగానే డిజిటల్ ఐడీ కార్డులను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాలన్నారు. మార్కులు, ఇతర వివరాలను ఒకసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత, వాటినే రిజిస్టర్లుగా ప్రింట్ తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని కోరారు. మార్కుల ఎంట్రీలో తప్పు లు దొర్లితే సవరించుకునేందుకు, ప్రింట్ తీసుకునేందుకు నిరంతర అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం హాజరు వేసే సమయంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, అనవసర నోటిఫికేషన్లు రాకుండా చూడాలన్నారు. యాప్‌లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం ఇద్దరు పిల్లలపై పిచ్చికుక్క దాడి చేసింది. నగరంలోని సంతపేట సాయినగర్ కాలనీలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి. అటువైపు వెళుతున్న వాళ్లను కరవడానికి ప్నయత్నిస్తుండగా స్థానికులు మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి వీధిలో సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు పిల్లలను పిచ్చి కుక్క వెంటాడి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పిల్లలను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు వాపోతున్నారు.


