‘నారాయణ’ఆగడాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ఆగడాలు అరికట్టాలి

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

– కళాశాల ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు, అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కొత్త బస్టాండ్‌ వద్ద ఉన్న నారాయణ కళాశాల ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్‌ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చేసి, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం నారాయణ జూనియర్‌ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అధికారిక షెడ్యూల్‌ రాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. నారాయణ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజుల విషయంలో విద్యార్థులను వేధించడం ఆపాలని, లేనిపక్షంలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సురేష్‌, లోహిత్‌, లిఖిత్‌, మనోజ్‌, గౌరవ్‌, గురు, నాని, లలిత్‌ పాల్గొన్నారు.

రైతుల సమక్షంలోనే

భూముల రీ సర్వే

తవణంపల్లె: రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే జరగాలని జిల్లా సర్వే శాఖ డీడీ జయరాజ్‌ మండల సర్వేయర్లను ఆదేశించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూ రీసర్వేను ఆయన తనిఖీ చేశారు. గోనెపల్లెలో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూతింగ్‌ భూముల రీసర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వేకు ముందు సర్వే సిబ్బంది నోటీసులు ఇస్తున్నారా.. లేదా సర్వే సక్రమంగా చేస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈకేవైసీ యాప్‌ ద్వారా తప్పనిసరిగా సర్వే చేయలని గ్రామ సర్వేయర్లను ఆదేశించారు. భూ రీసర్వేలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు గైర్హాజరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డీడీ రైతులతో మాట్లాడారు. భూముల గట్ల హద్దులను కచ్చితంగా చూపి గట్లు మేరకు రోవర్‌ సహాయంతో కో ఆర్డినేట్స్‌ చేసుకొని రీ సర్వే పారదర్శకంగా చేయాలని తెలిపారు. పైమాఘం, పుణ్యసముద్రం గ్రామాల్లో జరిగిన రీసర్వే వెక్టరైజేషన్‌ను తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీ చేశారు. గత నెలలో హద్దు తగాదా ఫైల్‌ను తనిఖీ చేసి ఫోన్‌ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడారు. కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఎం. కృష్ణమూర్తి, మండల ప్లాంట్‌ సర్వేయర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement