అరీష్‌.. అదుర్స్‌! | - | Sakshi
Sakshi News home page

అరీష్‌.. అదుర్స్‌!

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

గ్రామీణ నేపథ్యం.. గ్లోబల్‌ స్థాయి విజయం రైతు కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సర్జికల్‌ రోబోటిక్స్‌లో తెలుగు యువకుడి ముద్ర పల్లె బడి నుంచి అమెరికా ల్యాబ్‌ల వరకు ఖండాంతరాలు దాటిన చిత్తూరు జిల్లా ఖ్యాతి

చిత్తూరు కలెక్టరేట్‌: అతను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో.. పెరిగింది వ్యవసాయ కుటుంబంలో.. చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. కానీ, లక్ష్యం మాత్రం ఆకాశమంత. పట్టుదలే పెట్టిబడిగా, కృషినే ఆయుధంగా మలచుకుని ప్రస్తుతం అమెరికాలోని కనెక్టికట్‌ దేశంలో వైద్య రంగంలో సర్జికల్‌ రోబోటిక్స్‌ విభాగంలో తనదైన ముద్ర వేస్తున్నారు చిత్తూరు జిల్లా యువ ఇంజినీర్‌ అరీష్‌ దండు. గంగాధరనెల్లూరు మండలం, లక్ష్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాలయ్య, శాంతి దంపతుల కుమారుడు అరీష్‌ దండు. తండ్రి సామాన్య రైతు. అరీష్‌ గ్రామీణ వాతావరణంలో పెరిగినా, ఆయన కళ్లు మాత్రం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉండే లక్ష్యాల వైపు చూసేవి. చిన్నప్పటి నుంచి వినూత్న ఆలోచనలతో ఉండేవారు. ఇంజినీరింగ్‌ విద్యపై మక్కువతో అంచలంచెలుగా ఎదుగుతూ అమెరికా చేరుకున్నారు. అక్కడ పదేళ్లకు పైగా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో విశేష అనుభవం గడించారు. సాధారణ ఇంజినీరింగ్‌గా కెరీర్‌ను ప్రారంభించి, నేడు అత్యంత క్లిష్టమైన సర్జికల్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు.

భావితరాలకు మార్గదర్శి

అరీష్‌ దండు ఈ ఏడాది ఏప్రిల్‌లో జాన్‌ ఎస్‌.మార్టినెజ్‌ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 150 మందికి పైగా విద్యార్థులకు స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్‌మెటిక్స్‌) రంగాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నిర్వహించిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సదస్సులో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు.

పల్లె బడిలో పడిన పునాది

అరీష్‌ జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం నెల్లేపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయన ఉన్నత చదువుల అనంతరం ప్రతిభకు గుర్తింపుగా అమెరికాలో అవకాశాలు వరించాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ సమీపంలోని కనెక్టికట్‌లో ఉన్న మెడికల్‌ డివైజ్‌ కంపెనీలో 15 సంవత్సరాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అరీష్‌ దండు తన సాంకేతిక నైపుణ్యంతో రెండు అమెరికా పేటెంట్లను (యూఎస్‌ 11,585,042 బీ2) (యూఎస్‌ 11,993,890 బీ2) సాధించి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు. సర్జికల్‌ జైన్‌లలో ఆయన చేసిన మార్పులు వైద్య పరికరాల రంగంలో మైలురాళ్లుగా నిలిచాయి. కేవలం వృత్తికే పరిమితం కాకుండా ఏఎస్‌ఎంఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ రివ్యూయర్‌గా ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా వచ్చే ఇంజినీరింగ్‌ ఆవిష్కరణలను సమీక్షించడం, వాటికి దిశానిర్దేశం చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

సర్జికల్‌ రోబోటిక్స్‌లో సరికొత్త విప్లవం

అరిష్‌ దండు రోబోటిక్‌ సర్జరీ విభాగంలో తన ముద్ర వేశారు. రోబోటిక్‌ ఆర్మ్‌, సర్జికల్‌ ఆర్మ్‌ వ్యవస్థల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. శస్త్ర చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో, తక్కువ రిస్క్‌తో జరిగేలా ఆయన డిజైన్‌ చేసిన పరికరాలు తోడ్పడుతున్నాయి. వైద్య సేవలు ఖరీదైనవిగా మారుతున్న తరుణంలో, నాణ్యత తగ్గకుండా ఉత్పత్తుల తయారీ ఖర్చును ఎలా తగ్గించవచ్చో ఆయన నిరూపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement