జూదరుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జూదరుల అరెస్ట్‌

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

● దగ్ధమైన మామిడి చెట్లు ● ఐదుగురికి తీవ్ర గాయాలు నీటి కష్టాలు తీర్చండి

యాదమరి: అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్న జూదరులపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు...బుధవారం మండల పరిధి గొందివాండ్లవూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడి పందేలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో దాడులు చేశామన్నారు. గొందివాండ్లవూరుకు చెందిన గోవిందరాజులు, తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన దామోదరంను అరెస్టు చేసి వారి నుంచి రూ.2,400 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మరి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

తెగి పడిన విద్యుత్‌ తీగలు

తవణంపల్లె: మండలంలోని వెంగంపల్లెలో బుధవారం కరెంట్‌ తీగలు తెగిపడి మామిడి చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు ఎం.రెడ్డెప్ప తెలిపారు. వెంగంపల్లె సమీపంలో తన పొలంలో విద్యుత్‌ లేన్లు వెళుతున్నాయని చెప్పారు. రెండు రోజుల క్రితం కరెంటు తీగలు తెగిపడడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగినట్టు వెల్లడించారు. ఈ మేరకు తవణంపల్లె తహసీల్దార్‌, వీఆర్‌ఓకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 30 చెట్లు అగ్నికి ఆహుతైనట్లు వివరించారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న కంటైనర్‌

చంద్రగిరి: ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కంటైనర్‌ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌లోని ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన ముంగళిపట్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాకాల మండలం దామలచెరువు నుంచి తిరుపతికి ఓ ట్రాక్టర్‌లో కూలీలు మామిడికాయల ఖాళీ బాక్సులు వేసుకుని బయలుదేరారు. ట్రాక్టర్‌ ముంగళిపట్టు సమీపంలో వస్తుండగా బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న కంటైనర్‌ వెనుక నుంచి ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న దామలచెరువుకు చెందిన కూలీలు గిరి, శోభ, గోపి, మంజు, డ్రైవర్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్‌ తీగలు పడి వ్యక్తి మృతి

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ తీగలు తెగిపడటంతో షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్‌ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్‌ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్‌ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్‌ తీగ తెగి అతనిపై పడింది. షాక్‌కు గురైన ఓబుల్‌ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్‌ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.

పాలసముద్రం : మండలంలోని ఆముదాల పంచాయతీ, గొల్లకండ్రిగ బీసీ కాలనీలో గుక్కెడు నీటి కోసం స్థానికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పలువురు ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. నెల రోజుల క్రితం గ్రామంలోని తాగునీటి బోరు మోటారు మరమ్మతులకు గురైంది. దీన్ని ఇంతవరకు రిపేరు చేయకపోవడంతో నీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. అధికారులు స్పందించి బోరు మోటారు, ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులు చేయించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement