చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి పరిశ్రమలపై ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో ఉద్యానవన శాఖ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఆలోపు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.మామిడి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు రైతులకు సుమారు రూ.6.70 కోట్ల ప్రొటెక్షన్ కవర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లోని పల్ప్ యూనిట్ల ప్రస్తుత పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రామాంజనేయులు, మురళి, కోటేశ్వరరావు, పరమేశ్వరన్ పాల్గొన్నారు.


