గంగవరం: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో బుధువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పెద్దపంజాణి మండలం, దాసనంపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు నవీన్ అలియాస్ నరేష్(27) ఓ కోళ్ల హ్యాచరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పలమనేరు నుంచి పల్సర్ బైక్‌లో స్వగ్రామం దాసనంపల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలోని కోగిలేరు చెక్‌పోస్టుకు సమీపంలో వెళ్తుండగా పలమనేరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం బైక్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడి తల భాగంలో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


