చిత్తూరు అర్బన్: పోరాట యోధుడు ఇక లేరు. ఈదల వెంకటాచల నాయుడు (72) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాశ విడిచారు. పెనుమూరు మండలంలోని సాతంబాకం పక్కనున్న పెరుమాళ్లకండ్రిగలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఈ పాడిరైతుకు పెద్దగా ఆస్తుల్లేవు. ఆరెకరాల భూమి, నాలుగు ఆవులే ప్రపంచం. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప మరోలోకం తెలియని వ్యక్తి. పాలను డెయిరీకి పోసి నెలవారీ బిల్లులు తీసుకుని జీవనం సాగించేవారు. కానీ గత 25 ఏళ్లుగా జిల్లాలో ఏ మారుమూల గ్రామంలోనైనా సరే అన్నదాతకు కష్టమొస్తే ముందుంటాడు. ఆపదలో ఉన్న రైతుకు అండగా ఉండేవాడు. తన నిరసన గళాన్ని పాలకులకు వినిపించేలా సమస్యలపై పోరాటం చేసేవారు. ఆ నిరసన ఎలా ఉంటుందంటే రాజధానిలో ఏసీ గదుల్లో కూర్చున్న నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది.
చొక్కా వేసుకోకుండానే..!
2003లో చిత్తూరు నుంచి సాతంబాకం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన నాయుడు.. రూ.5 ఇచ్చి టికెట్టు ఇవ్వమన్నాడు. కండక్టర్ రూ.7 అడిగాడు. ఎందుకని అడిగితే చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి నాలుగు స్టేజీలు ఉండేవి. ఇప్పుడు ఐదో స్టేజీ పెరిగింది. అందుకే రూ.2 అదనంగా చెల్లించారని కండక్టర్ చెప్పడంతో ఆ ఏడాది జూన్‌లో నిసరన చేపట్టారు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 16 రోజుల పాటు వెంకటాచలంనాయుడు ఉద్యమం సాగింది. ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008లో 13 రోజుల పాటు దీక్షలు చేశాడు. ఇక దక్షిణాసియాలోనే ఒక వెలుగు వెలిగిన చిత్తూరు విజయా డెయిరీకి 2002లో అప్పటి చంద్రబాబు నాయుడు హయంలో పాలకవర్గం డెయిరీని మూసేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. నాయుడు లోలోపల మదనపడిపోయారు. 2004లో చిత్తూరుకు ఓ పనిపై వచ్చిన వెంకటాచల నాయుడు విజయా డెయిరీ వైపు వెళ్లాడు. డెయిరీని, అక్కడ ఉన్న యంత్రపరికరాలు చూసి చలించిపోయారు. అప్పటి నుంచి విజయా డెయిరీని తెరిపించాలని నిరహారదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తూనే ఉండేవారు. డెయిరీని పునఃప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని 2007 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు దీక్షబూనాడు. పెనుమూరులోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయించాలని 2008లో 18 రోజలు దీక్ష చేశాడు. డెయిరీ తెరిపించాలని 2015లో హైదరాబాద్ వెళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు నిరసన దీక్షబూనారు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను తొలగించడమేగాకుండా, క్రషింగ్ ఆపేయడంపై ఫ్యాక్టరీ వద్ద ఉద్యమం చేశారు. ఆ మొండి పట్టుదల ఆయన మరణం వరకు చొక్కా వేసుకోకుండా, కాళ్లకు చెప్పులు తొడగకుండానే కన్నుమూశారు.
చేయిచాచని ఆత్మాభిమానం
వెంకటాచలం నాయుడుది ఓ మధ్యతరగతి సాధారణ రైతు కుటుంబం. ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. పాలడబ్బులు, పొలంలో వచ్చే ఆదాయంతోనే పిల్లల బాధ్యతలు తీర్చారు. ఉద్యమాల బాట పట్టడంతో ఇల్లు గడవడానికి, ఊర్లు తిరగడానికి ఆరెకరాల పొలంలో ఓ ఎకరం అమ్మేశాడు. అయినా సరే ఉద్యమాలకు ఎవరినీ ఆర్థిక సాయం అడగని నైజం నాయుడిది. ఎవరైనా ఉద్యమాలకు డబ్బులిచ్చినా ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని, తనకు ఎలాంటి ఆర్థిక సాయం వద్దని వెంకటాచలం నాయుడు మొహంపైనే చెప్పేసేవారు.
2018లో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేపట్టిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంకటాచల నాయుడు గురించి తెలుసుకున్నారు. పూతలపట్టు సమీపంలో జరిగిన బహిరంగ సభలో వెంకటాచల నాయుడును స్టేజీపైకి పిలిపించి ఆయన పోరాట పటిమను మెచ్చుకుని అభినందించారు. తాము అధికారంలోకి వస్తే చిత్తూరు సహాకార పాల డెయిరీని పునఃప్రారంభిస్తామని వాగ్ధానం చేశారు. ఆపై వైఎస్.జగన్ సీఎం అవడం, విజయా డెయిరీని పునఃప్రారంభించడం తెలిసిందే.


