చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
లైఫ్ సర్టిఫికెట్ కష్టాలకు చెల్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి ఏడాదీ ప్రారంభంలో పెన్షన్‌దారులు అందించే లైఫ్ సర్టిఫికెట్‌ల విషయంలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు పలు మార్పులు తీసుకొచ్చారు. సెల్‌ఫోన్ నుంచే నేరుగా నిధి అనే యాప్‌లో లైఫ్ సర్టిఫికెట్ అందించేలా అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యాంక్ లేదా, మీసేవ, పోస్టాఫీస్‌లో అందించాల్సి వచ్చేది. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్‌లు ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోయేది. ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాకు సంబంధించి దాదాపు 17 వేల మంది పెన్షన్‌దారులు ఉన్నారు. మంచాన పడ్డ పెన్షన్‌దారుల వద్దకు నేరుగా ట్రెజరీ అధికారులే వెళ్లి పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే ఫోన్ నుంచే నేరుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు.
పది గ్రామాల్లో నీటి సమస్య
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పది గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడుపల్లెలో–4 ట్యాంక్లు, శాంతిపురంలో–2, రామకుప్పం–1 చొప్పున రోజూ 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను 17 ట్రిప్ప్‌ల వరకు తిప్పుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే పలమనేరు, వి.కోట, పులిచెర్లలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో వ్యవసాయ బోరుతో అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గ్రామాల్లో నీటి సమస్య ఉంటే 08572–233098 నంబరులో సంప్రదించాలన్నారు. జూన్ చివరి నాటికి నీటి సరఫరాకు రూ.23 లక్షలు అవసరముంటుందని ప్రభుత్వానికి నివేదిక పెట్టినట్టు వెల్లడించారు.
బకాయిలు రూ.64 కోట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నగరి నియోజకవర్గం నిండ్ర చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి రైతుల అధికారిక బకాయిలను ఖరారు చేసినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ బకాయిలకు ఎదురుచూస్తున్న 1,650 మంది రైతులకు ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆ రైతులందరికీ అసలు, మొత్తం, వడ్డితో కలిపి రూ.64 కోట్లను అధికారిక బకాయిలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యలో రైతులకు న్యాయం చేసేందుకు రూ.34 కోట్ల అసలుతో పాటు రూ.30 కోట్లు వడ్డీని క్లెయిమ్‌లో చేర్పించినట్టు వెల్లడించారు. ట్రిబ్యునల్ నియమించిన రిసొల్యూషన్ ప్రొఫెషనల్ రూ.64 కోట్లను చెల్లించాల్సిన బకాయిలుగా అంగీకరిస్తూ అధికారికంగా ధృవీకరించారన్నారు. రైతులకు అందాల్సిన నగదును అందజేసేలా న్యాయపరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
జూలైలో ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ బ్యాచ్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రేపు ఎస్వీయూలో
జాబ్‌మేళా
తిరుపతి సిటీ: స్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


