తిప్పించుకుంటున్నారు! | - | Sakshi
Sakshi News home page

తిప్పించుకుంటున్నారు!

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

● గోల్డ్‌ లోన్లకు ముఖం చాటేస్తున్న బ్యాంకులు ● రైతులను తిప్పించుకుంటున్న బ్యాంకర్లు ● ఆపై సవాలక్ష ఆంక్షలు, సాకులు ● రెన్యూవల్‌కు బ్రేకులు ● పాత రుణం చెల్లించినా కొత్తగా ఇవ్వని వైనం

బడా నాయకులు, వ్యాపార వేత్తలకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతుల విషయంలో పలు కొర్రీలు పెడుతున్నాయి. వారి సొత్తు తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వడానికి కూడా సవాలక్ష షరతులు పెడుతున్నాయి. కొందరు బ్యాంకర్లు రుణం ఇవ్వడం లేదని చెప్పలేక రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల రైతులు దినసరి ఆదాయాన్ని కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు.

కాణిపాకం: జిల్లాలో 220 వరకు బ్యాంకులు ఉన్నాయి. ఇందులో కొన్ని బ్యాంకులు గోల్డ్‌ లోన్లపై కొత్తగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. గ్రాముకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు మాత్రమే రుణం ఇస్తామని చెబుతున్నాయి. మార్కెట్‌లో బంగారం విలువ పెరిగినా, బ్యాంకులు మాత్రం తక్కువ మొత్తానికే పరిమితం కావడం రైతుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పలు బ్యాంకులు అదనపు పత్రాలు, హామీలు కోరుతూ రుణాల ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకుల అధికారులు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. గట్టిగా అడిగితే సాకులు చెబుతూ రేపు, మాపు అంటున్నారు. ఒకప్పుడు సులభంగా లభించిన రుణాలు ఇప్పుడు రైతులకు అందకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.

మామిడి రైతుల ఆవేదన

జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో మామిడి రైతులకు నగదు అవసరం అధికంగా ఉంటుంది. తోటల నిర్వహణ, కోత, రవాణా ఖర్చులు పెరగడంతో రుణాలపై ఆధార పడాల్సి వస్తోంది. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు డబ్బు అవసరం ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి కీలక సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యాపార వర్గాలు, ఇతర రంగాల వారికి రుణాలు సులభంగా మంజూరు చేస్తున్న బ్యాంకులు, రైతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు

రుణం కోసం పనులు మానేసి రోజులు, వారాల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుండడంతో రైతుల దినసరి ఆదాయం దెబ్బతింటోంది. రుణాల కోసం బ్యాంకర్లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే తాము మరింత ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం ఖాయమని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

బాబు (పేరు మార్చాం) అనే రైతు మూడేళ్ల క్రితం చిత్తూరు నగరం హైరోడ్డులోని ఒక బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. రెండేళ్లు రెన్యువల్‌ చేయించాడు. గత ఏడాది పూర్తిగా డబ్బులు కడితేనే రెన్యువల్‌ చేస్తామని అధికారులు షరతు పెట్టారు. దీంతో అతను పాత అప్పు చెల్లించి, కొత్త రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రెన్యువల్‌ చేసి కొత్త రుణం ఇవ్వాలని అడిగాడు. బ్యాంకర్లు శనివారం రమ్మన్నారు. శనివారం వెళితే.. సోమవారమన్నారు. ఇలా తిప్పించుకుంటుండడంతో చేసేది లేక మరో బ్యాంకును ఆశ్రయించాల్సి వచ్చింది.

రెన్యూవల్‌కు బ్రేకులు.. కొత్త రుణాలకు తాళం

పాత రుణాలను కష్టపడి చెల్లించిన రైతులకు కూడా కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రెన్యువల్‌ ప్రక్రియలో జాప్యం చేస్తూ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరికి చిన్న చిన్న కారణాలు చూపుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. పాత రుణాలను తీర్చేందుకు రైతులు ప్రైవేట్‌ అప్పులు చేసి చెల్లించినా, కొత్త రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ అప్పుల ఒత్తిడి, మరోవైపు బ్యాంకు రుణాలు అందకపోవడం రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement