కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి–బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శ న భాగ్యం కల్పించారు. తరువాత ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఆస్థాన మండపానికి తీసుకెళ్లి కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని జరిపించారు. అనంత రం స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.


