అవినీతి ‘వినోద’ం! | - | Sakshi
Sakshi News home page

అవినీతి ‘వినోద’ం!

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

● కలెక్టరేట్‌లో నిరసన చేపట్టిన ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ● సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశం ● జిల్లా కేంద్రం లక్ష్మీనగర్‌ కాలనీలోని వయోవృద్ధుల హోమ్‌లో పార్క్‌, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పా టు చేసినట్లు తప్పు డు నివేదికలు ఇచ్చి రూ.5 లక్షలు డ్రా చేసుకోవడం ● తిరుపతి అంధుల శరణాలయంలో మైనర్‌ పనులు, మెటీరియల్‌ పంపిణీ పేరుతో ఎటువంటి పనులు చేయకుండానే తన తమ్ముడు శ్రావణ్‌కుమార్‌ పేరుతో రూ.3,04,960 బిల్లులు పొందడం. ● నెలకు రూ.35 వేలు చొప్పున హైర్‌ వెహికల్‌ బిల్లులను అక్రమంగా మంజూరు చేసుకోవడం. చివరికి మెడికల్‌ సెలవులో ఉన్న సమయంలోనూ ఈ బిల్లులు డ్రా చేయడం ● కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ జిల్లాకు కేటాయించిన రూ.10 లక్షల నిధులను తిరుపతి జిల్లా బదిలీ చేయించుకుని అక్రమాలకు పాల్పడడం

చిత్తూరు కలెక్టరేట్‌ : సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్‌ అక్రమాలపై నిరసనలు మిన్నంటాయి. దాదాపు కోటి రూపాయల వరకు ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించిన ఏడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) సోమ వారం కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టింది. ఏడీ అవినీతి వ్యవహారంపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ స్పందించారు. దీనిపై సమగ్రంగా విచారించేందుకు ఓ ఉన్నత స్థాయి అధికారిని నియమించారు. ఏడీ అక్రమాలకు సంబంధించి జేఏసీ సంఘం ఆధారాలతో సహా కలెక్టర్‌కు అందజేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్‌, గౌరవాధ్యక్షులు ఉమా పతి పిళ్‌లై, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, సుమతి, లీలాపతినాయుడు పాల్గొన్నారు.

పథకాల పేరుతో దోపిడీ

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో మత్తు పదార్థాల నివారణపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉండగా, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే రూ.8.94 లక్షల వరకు ఏడీ స్వాహా చేసినట్లు జేఏసీ నాయకులు ఆరోపించారు. ఇతర జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి తప్పుడు నివేదికలను సృష్టించి నిధులు డ్రా చేసినట్టు పేర్కొన్నారు. వయోవృద్ధుల చట్టాల ప్రచారానికి కేటాయించిన రూ.16 లక్షలను క్షేత్ర స్థాయిలో ఖర్చు చేయకుండానే తన అనుకూల వ్యక్తుల పేరుతో మళ్లించారని నాయకులు వెల్లడించారు.

నిధుల మళ్లింపులో ‘వినోద’ మార్కు

తొమ్మిది నెలల్లోనే రూ.కోటి దాకా..!

ఏడీ వినోద్‌ గత 30 ఏళ్లుగా ఇదే జిల్లాలో టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ వ్యవస్థలన్నింటినీ మేనేజ్‌ చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఉద్యోగోన్నతి పొందిన కేవలం 9 నెలల్లోనే దాదాపు కోటి రూపాయాలు ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

దివ్యాంగుల నిధులు దిగమింగిన ఏడీ

Advertisement
 
Advertisement
Advertisement