ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే!

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

పల్లెల్లో ఊసేలేని స్థానిక రాజకీయ వేడి

నిరాశలో సర్పంచ్‌ ఆశావహులు

బీసీ జనగణన ఫూర్తయితేనే రిజర్వేషన్లు

ఇప్పట్లో స్థానిక ఎన్నికలను నిర్వహించలేమన్న ఎన్నికల కమిషన్‌

గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్‌ 2వ తేదీన ముగిసింది. ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించుకుండా ఏవేవో కుంటి సాకులు చెప్పి ప్రత్యేక అధికారులను నియమించింది. తాజాగా బీసీ జనగణన పూర్తయి ఆపై ఎన్నికల కమిషన్‌ రిజర్వేషన్లు నిర్ణయిస్తే గాని ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే స్థానిక సంస్థలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సర్పంచు, ఎంపీటీసీ పదవులకు పోటీ చేయాలని ఆశించిన ఆశావహులు నిరాశకు గురయ్యారు. పల్లెల్లో రాజకీయ వేడి చల్లబడినట్టే.

పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2021లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 1,411 పంచాయతీలు, 13,574 వార్డులు ఉండగా కోర్టు కేసులు, పంచాయతీ విలీనాలు పోగా మిగిలిన 1,368 పంచాయతీలకు నాలుగు దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. వాటిలో 358 స్థానాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అప్పట్లో ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగాయి. జిల్లాల విభజన తర్వాత చిత్తూరు జిల్లాలో మొత్తం పంచాయతీలు 622, మొత్తం వార్డులు 5,914, మండలాలు 27 ఉన్నాయి. వీటిలో మొత్తం ఓటర్లు 10.26 లక్షల మంది ఉన్నారు. 2021లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. 2026 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత జనవరిలోనే ముందస్తుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏవేవో కుంటి సాకులు చెప్పి నిర్వహించలేదు. ఏప్రిల్‌ 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. ఇప్పుడు బీసీ జనగణన, కొత్త రిజర్వేషన్లు, జనాభా లెక్కల సేకరణ సాకుతో మళ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అన్న మాట రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.

బెడిసికొట్టిన కూటమి నేతల

రిజర్వేషన్‌ ప్లాను

ఏ పంచాయతీలో ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుందో అన్న కోణంలో స్థానిక కూటమి నేతలు ప్లాన్లు చేసుకున్నారు. ఆ మేరకు పంచాయతీల వారిగా గెలిచే సామర్థ్యం ఉన్న వారికి అక్కడ రిజర్వేషన్లలో స్థానం దక్కేలా పావులు కదిపారు. కొందరు సర్పంచులుగా గెలిచినట్టేనని డాంభికాలు కూడా ప్రదర్శించారు. ఈ విషయమై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముందుగానే జాబితా సిద్ధం చేసుకుని కావాల్సిన వారికి తగినట్టుగా రిజర్వేషన్లను అధికారుల ద్వారా చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బీసీ జనగణనతో రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో ఆశావాహుల నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది.

పలమనేరు మండలంలోని కల్లాడు గ్రామ సచివాలయం

చిత్తూరు జిల్లాలో పంచాయతీలు

మొత్తం పంచాయతీలు 622

మొత్తం వార్డులు 5914

మండలాలు 27

మొత్తం ఓటర్లు 10.26 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement