గుడిపాల: మండలంలోని 189 కొత్తపల్లె పంచాయతీ మిట్టయిండ్లు గ్రామంలోని వినాయకస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రెండు హుండీలను పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.10 వేల నగదును చోరీ చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. అలాగే గుడి తలుపు లను పగులగొట్టి చిందరవందర చేశారని పేర్కొన్నారు. గుడి పక్కన ఉన్న ఒక సైకిల్‌ను కూడా అపహరించారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఇద్దరు దొంగల అరెస్టు
– ద్విచక్ర వాహనం,
100 సెల్‌ఫోన్లు స్వాధీనం
బంగారుపాళెం : ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 100 సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వారు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని నలగాంపల్లె ఫ్లైఓవర్ వద్ద ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. విచారణలో అతను పాత నేరస్తుడు దాసరి రాముగా తేలిందన్నారు. అతను పెద్దపంజాణి మండలం రాయల్‌పేట గ్రామం తాయారమ్మ కాలనీకి చెందిన వాడని, ప్రస్తుతం బంగారుపాళెం ఎస్సీ హాస్టల్ సమీపంలోని పాత అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద అద్దె గదిలో ఉంటున్నట్టు గుర్తించామన్నారు. అతను చోరీలకు పాల్పడుతున్నట్టు తేలిందన్నారు. అతని నుంచి రూ.90 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో వ్యక్తి తగ్గువారిపల్లె కసాయి వీధికి చెందిన సుబ్రమణ్యంను అరెస్టు చేసి అతని నుంచి బిల్లులు లేని 98 సెల్‌పోన్లు, మరో రెండు సెల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.5.26 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
8న ఉపనయన మహోత్సవం
తిరుపతి కల్చరల్: రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో ఈనెల 8వ తేదీ ఉదయం 7 నుంచి 8.20 గంటల వరకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించనున్నట్టు పీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరసింహాచార్య, రేణిగుంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. ఎన్‌జీఓ కాలనీలోని జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యాలయంలో ఆదివారం ఉపనయన మహోత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబీకులు తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇందుకోసం ఎలాంటి ఫీజు లేదని, ఉచితంగానే పూజా సామగ్రిని సైతం అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం సైతం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9849120030, 9440855423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రెడ్డి ప్రకాష్, బాలాజీ శర్మ, శివకుమార్, కల్యాణకుమార్, డాక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.


