పెనుమూరు(కార్వేటినగరం): పచ్చనేతలు తమ పట్టా భూమి లో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించిందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ, మనియాణంపల్లికి చెందిన రేణుక ఆరోపించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తాము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని తెలిపారు. టీడీపీ నేతలు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నారని వాపోయారు. గ్రామ సమీపంలో ఉన్న కూటమి నాయకుడి క్యారీకి దారి కోసం తమకు చెందిన సర్వే నంబర్ 1007/1లో ఉన్న 1.41 ఎకరాల పట్టా భూమిలో రోడ్డు వేస్తున్నారని ఆరో పించారు. రాత్రికి రాత్రే మామిడి చెట్లను నరికేశారని, పెన్సింగ్ ను ధ్వంసం చేశారని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు తమ కుటుంబాన్ని గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకుండా వెలివేశారని వాపోయారు. న్యాయం కోసం మాట్లాడితే చంపుతామని బెదిరిస్తున్నారని, అనుక్షణం ప్రాణభయంతో జీవిస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పైగా టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడబోమన్నారు.
పరిశీలించి న్యాయం చేస్తాం
దీనిపై తహసీల్దార్ వివరణ ఇస్తూ రేణుక సెటిల్‌మెంట్ భూమిలో దౌర్జన్యంగా పెన్సింగ్ తొలగించి, మామిడి చెట్లను నరికేసి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.
పెన్సింగ్‌కు వేసిన రాతి కూశాలను తొలగించిన దృఽశ్యం
టీడీపీ నాయకులు నరికి వేసిన మామిడి చెట్లు


