కుప్పం రూరల్ : మండలంలోని సలార్లపల్లి సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కురబ కులస్తులు 14 ఏళ్లకు ఒకసారి చేపట్టే పెద్ద దేవర (కోడేళ్ల రాయస్వామి) జాతరను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతర మూడు రోజులు జరుగుతుంది. ఇందులో భాగంగా సోమవారం గురుపూజ, హరికథా కాలక్షేపం, పండరి భజన, ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. అలాగే కురబలు పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. తర్వాత భక్తులు తమ తలపై టెంకాయలు కొట్టించుకుంటారు. మంగళవారం మేలు దీపం, వసంతోత్సవంతో జాతర ముగుస్తుంది. సోమవారం జరిగే ప్రత్యేక కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలిరానుండడంతో సలార్లపల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.


