యాప్‌లపై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ | - | Sakshi
Sakshi News home page

యాప్‌లపై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మాతా–శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా యాప్‌ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో నాగ శశిభూషణ్‌ రెడ్డి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం పీహెచ్‌సీల డాక్టర్లు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆర్‌సీహెచ్‌, డీఐఎన్‌సీ, సంజీవిని, కేసీడీ యాప్‌ల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భిణుల రిజిస్ట్రేషన్‌ నుంచి అన్ని ఆరోగ్య సేవలను యాప్‌లలో సమయానుకూలంగా నమోదు చేయాలన్నారు. తద్వారా మాతాశిశు మరణాలను నివారించవచ్చన్నారు. డాక్టర్లు ప్రతిరోజూ యాప్‌ను పరిశీలించి ఏఎన్‌ఎంల పనితీరును పర్యవేక్షించాలని, లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. సంజీవిని కార్యక్రమం కింద ప్రతి వ్యక్తికీ మొబైల్‌ నంబర్‌తో అభ ఐడీల సృష్టి అవసరమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో చికిత్స సులభతరం అవుతుందని చెప్పారు. ఓపీకి వచ్చిన రోగుల్లో ఎక్కువ మందికి అభ ఐడీలు సృష్టించడంతో పాటు మిగిలిన వారి డేటాను ఇతర సిబ్బంది ద్వారా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీ, గ్రామ ఆరోగ్య కేంద్రం ఐదు రోజుల్లో క్వాలిటీ చెక్‌లిస్ట్‌, ఎస్‌వోపీ ప్రకారం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుని శిక్షణలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి పబ్లిక్‌ పాజిటివ్‌ పర్సెప్షన్‌ను 80 శాతానికి పైగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే ప్రతి నెలా డెలివరీలు నిర్వహించడం, 3000 ల్యాబ్‌ పరీక్షలు చేయడం, ఐయూసీడీ సేవలను నెలకు ఆరుగురికి అందించడం ద్వారా పీహెచ్‌సీ గ్రేడింగ్‌ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అనీల్‌ కుమార్‌, ప్రవీణ, అనూష, ఎస్‌వో జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement