ప్రజలకు సమాచారాన్ని అందించడంతోపాటు సామాజిక సేవల్లోనూ సాక్షి దినపత్రిక ముందు ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తన వంతు కృషి చేస్తోంది. గత ఏడాది జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. వాటిని చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. తమకు సాక్షి మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందని, పరీక్షలపై భయంపోయి టాపర్లుగా నిలిచామని చెబుతున్నారు. తమను ప్రోత్సహించిన సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా గణితం, సైన్స్ సబ్జెక్టులపై నిపుణుల ఆధ్వ ర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను సాక్షి యాజమాన్యం ఉచితంగా అందజేసింది. అంతే కాకుండా సాక్షి దినపత్రికలోనూ ప్రతి రోజూ అన్ని సబ్జెక్టుల నిపుణుల సూచనలతో మెటీరియల్ ప్రచురించింది. టీచర్ల బోధనకు తోడు వీటి ఆధా రంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాక అవగాహన కోసం పరీక్షలు నిర్వహించారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులపై పట్టు పెరిగి, పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి టాపర్లుగా నిలిచారు. ఇందులో పలువురు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించడం విశేషం. నాణ్యమైన కంటెంట్, సులభమైన వివరణలతో పరీక్షలపై భయం పోయి తాము టాపర్లుగా నిలవడానికి సాక్షి అందించిన ఉచిత మెటీరియలే కారణమని విద్యార్థులు వెల్లడిస్తూ యాజమాన్యానికి కృతజ్ణతలు తెలిపారు.
సమయ పాలన తెలిసింది
సిలబస్ మొత్తం చదివినా, మూడు గంటల్లో పేపర్ ఎలా పూర్తి చేయాలనేది సవాలుగా ఉండేది. సాక్షి మెటీరియల్‌లో నిపుణులు ఇచ్చిన టైం మేనేజ్‌మెంట్ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలిగాను. – నవ్యశ్రీ, 581, ఉన్నత పాఠశాల, పాలసముద్రం
మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నాను
సాంఘిక శాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్, ముఖ్యమైన సంవత్సరాలను గుర్తించుకోవడం నాకు సవాలుగా ఉండేది. సాక్షి మెటీరియల్‌లో ఇచ్చిన చార్ట్స్, మ్యాప్స్‌లో ఆ విషయాలను నేను సులభంగా గుర్తించుకోగలిగాను. ఇది నా స్కోర్‌ను పెంచడంలో ఎంతో సహాయపడింది.
– శశిర, 580 మార్కులు, జెడ్పీ హైస్కూల్, కత్తెరపల్లి, కార్వేటినగరం
ప్రశ్నల సరళిపై అవగాహన
పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో అని ఆందోళన ఉండేది. సాక్షి అందించిన మోడల్ పేపర్స్‌లో ప్రశ్నల విశ్లేషణ పరీక్ష సరళిపై పూర్తి అవగాహన కల్పించాయి. అన్ని సబ్జెక్టుల్లో పట్టు పొందేందుకు అవకాశం కలిగింది. మెటీరియల్ వల్లే ఉత్తమ మార్కులు సాధించగలిగాను.
– జైకిషోర్, 591 మార్కులు, జెడ్పీ పి.కొత్తకోట,
పూతలపట్టు మండలం
సులభంగా సైన్స్ డయాగ్రమ్స్
బయోలాజికల్ సైన్స్‌లో చిత్రపటాలు గీయడం నాకు చాలా కష్టంగా ఉండేది. సాక్షి మెటీరియల్‌లో డయాగ్రమ్స్‌ను సులభంగా ఎలా గీయవచ్చో స్టెప్ బై స్టెప్ వివరించారు. ముఖ్యమైన పాయింట్లను బుల్లెట్ రూపంలో ఇవ్వడం వల్ల రివిజన్ చేసుకోవడం సులభమైంది. చాలా సంతోషంగా ఉంది. – వర్షిత,
584 మార్కులు, ప్రభుత్వ హైస్కూల్, మిట్టఇండ్లు
గణితంపై పట్టు వచ్చింది
నాకు మొదట్లో లెక్కలంటే చాలా భయం ఉండేది. సాక్షి మెటీరియల్‌లో క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభమైన పద్ధతుల్లో వివరించారు. ముఖ్యంగా థీరమ్స్, గ్రాఫ్స్ విషయంలో మెటీరియల్ నాకు ఎంతో దైర్యాన్ని ఇచ్చింది. దానివల్లే నేను గణితంలో మంచి మార్కులు సాధించగలిగాను. – అగస్టిన్, 531 మార్కులు,
జెడ్పీ అత్తూరు, నిండ్ర మండలం


