వి.కోట హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు! | - | Sakshi
Sakshi News home page

వి.కోట హత్య కేసులో ఎన్నో ట్విస్ట్‌లు!

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

● బెంగళూరు పోలీసులకు లొంగిపోయిన తమీమ్‌, సుభాన్‌ ● తెరపైకి వి.కోటకు చెందిన శ్రీనివాసులు పేరు ● పక్కా పథకం ప్రకారమే హత్య?

పలమనేరు:జిల్లాలో సంచలనం సృష్టించిన వి.కోటలో జర్నలిస్ట్‌ జగన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో పలు ట్విస్ట్‌ లు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు తమీం, అతని బంధువు సుభాన్‌ బెంగళూరు వెళ్లి లాయర్‌ను సంప్ర దించి అక్కడి ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులకు లొంగిపోయినట్టు తెలిసింది. గతం నుంచి తనకు సాయం చేస్తున్న వి.కోటకు చెందిన శ్రీనివాసులు డైరెక్షన్‌లోనే ఈ తంతు సాగిందన్న అనుమానంతో అతన్ని కూడా విచారించినట్టు తెలుస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డితో ఇటీవల మాట్లాడిన వ్యక్తులు, వారి కదలికలపై ఫోన్‌ డేటా ఆధారంగా కేసును విచారిస్తున్నట్టు సమాచారం.

తొలినుంచే జగన్‌పై కక్ష పెంచుకున్న శ్రీనివాసులు

వి.కోటలోని టీచర్స్‌కాలనీలో ఓ స్థలాన్ని శ్రీనివాసులు ఇతరులకు విక్రయించాడు. ఆస్థలం దొంగా పట్టా అని జగన్‌మోహన్‌రెడ్డి తహసీల్దార్‌ ద్వారా నిరూపించడంతో శ్రీనివాసులు కక్ష పెంచుకున్నాడన్న మాట వినిపిస్తోంది. అలాగే శ్రీనివాసులు ఒక మహిళతో సన్నిహి తంగా ఉన్న వ్యవహారంలో జగన్‌మోహన్‌ తలదూర్చి వారి కుటుంబంలో చిచ్చురేపడం మరింత ఆగ్రహం తెప్పించింది.

తొలి నుంచి తమీమ్‌కు అండగా నిలిచిన శ్రీనివాసులు

బెంగళూరులో 2021లో గంజాయి కేసులో వి.కోటకు చెందిన ఆరీఫ్‌పై తమీమ్‌ సమాచారం ఇచ్చాడు. అది కావాలనే ఇచ్చినట్టు తేలడంతో తమీమ్‌ను పోలీసులు జైలుకు పంపారు. ఇందులో జగన్‌మోహన్‌రెడ్డి తన స్నేహితుడైన ఆరీఫ్‌కు సాయం చేశాడు. జైలులో ఉన్న తమీమ్‌ను శ్రీనివాసులు బెయిల్‌పై విడిపించాడు. 2024లో వి.కోటలో జరిగిన మత ఘర్షణల కేసులో అరెస్ట్‌ అయిన తమీమ్‌కు మళ్లీ శ్రీనివాసులే జామీను ఇచ్చాడు. ఆపై తమీమ్‌పై రౌడీ షీటర్‌, ఊరి బహిష్కరణ వేటు పడింది. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి కారణమ ని తమీమ్‌ పగ పెంచుకున్నట్టు అనుమానిస్తున్నారు.

పక్కా పథకం మేరకే హత్య

గత నెల 24న పలమనేరు కోర్టు వద్దకు జగన్‌మోహన్‌రెడ్డి మత కలహాల కేసుకు సంబంధించి పలువురితో కలిసి వచ్చాడు. తమీమ్‌, సుభాన్‌ మరో కేసులో అదే కోర్టుకు వచ్చారు. ఆ రోజు నుంచి శ్రీనివాసులు వాట్సాప్‌ కాల్స్‌లోనే మాట్లాడాడు. ఇలా జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీనివాసులు, తమీమ్‌ శత్రువులని పోలీసులు అనుమానించారు. శ్రీనివాసులును అదుపులోకి తీసు కుని విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటకలోనే సరెండర్‌ ఎందుకంటే...

హంతకున్ని ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్‌ వచ్చింది. నిందితులు తమ న్యాయవాదుల సలహాతో కర్ణాటకలో లొంగిపోయినట్టు తెలుస్తోంది. అప్పుడు ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్‌తో విచారణకు తీసుకురావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా త్వరలోనే ఈ కేసును ఛేదించి అనేక విషయాలను బయటపెడతామని డీఎస్పీ డేగల ప్రభాకర్‌ తెలిపారు.

శ్రీనివాసులు (ఫైల్‌)

నిందితుడు తమీమ్‌(ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement