చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేడు సామాజిక మాధ్యమాల కాలం నడుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్‌లో చిట్‌చాట్ వారి చేతిల్లో బిజీవుతోంది. ఫాలో.. చాట్.. లైకులతో మొదలైన వారి ప్రయాణం లవ్ స్టోరీల వరకు చేరి చివరకు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. తీరా ఏడు అడుగుల్లోనే బంధాలు బలహీనమై ఏడిపిస్తున్నాయి. యుక్త వయస్సులోనే విడాకులంటూ.. తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలాంటి బలహీన బంధాలపై పోలీసులు, విద్యావేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు.
చాట్ నుంచి పెళ్లి పీటల వరకు
ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలో లైక్.. చాట్ ఇలా మొదలయ్యే పరిచయాలు రోజురోజుకు దగ్గరవుతూ ప్రేమగా మారుతున్నాయి. అరచేతిలోనే రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి ప్రేమగా ముడిపడిపోతున్నాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా సాగుతున్న ఈ సంబంధాలు, చివరకు పెద్దల అనుమతి లేకుండానే పెళ్లి పీటలు ఎక్కే స్థాయికి చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాల్య వివాహాల మాదిరిగా చిన్న వయసులో నే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక చాలా మంది యువతీయువకులు ప్రేమ, పెళ్లి మోజులో పడి మోసపోతున్నారు. రూ.లక్షల్లో నగదు దారబోసుకుంటున్నారు.
ఫ్యాషన్‌గా మారిన ప్రేమ పెళ్లిళ్లు
సినిమాలు, రీల్స్, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో ప్రేమ పెళ్లిళ్లు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇదే క్రేజ్‌గా భావించి జీవితాంతం బాధ్యతలను మరిచిపోతున్నా రు. తొందరపాటు నిర్ణయాలతో ఏర్పడిన ఈ బంధా లు చిన్నచిన్న విభేదాలతో ముగిసి పోతున్నాయి. పెళ్లి తర్వాత వాస్తవ జీవనంలో వచ్చే సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఒత్తిడులను తట్టుకోలేక యువ జంటలు విడాకుల దిశగా వెళ్లిపోతున్నాయి.
ఫోన్ ఉంటేనే ముద్ద దిగేది
ప్రస్తుతం పుట్టిన బిడ్డ కూడా ఫోన్ పట్టుకుంటోంది. చేతిలో ఫోన్ లేకుండా పిల్లలకు నోట్లో ముద్ద దిగనంటోంది. అలా పెరిగే కొద్ది పిల్లలకు ఫోనే ప్రపంచంగా మారిపోయింది. ఆపై సామాజిక మాధ్యమానికి అతుక్కుపోతోంది. చిట్‌చాట్‌లతో పాటు రీల్స్ పిచ్చికి పిచ్చెక్కిపోతోంది. డిజిటల్ యుగంలో ప్రతి క్షణం మొబైల్‌తో మమేకమవుతున్న యువత, సోషల్ మీడి యా వలలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికలు పరిచయాలకు, ఆ పరిచయా లు ప్రేమలకు, ఆపై పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. ఈ వేగం ఎంత త్వరగా మొదలవుతుందో అంతే వేగంగా ముగుస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి.
నేడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువైంది. వీటిలో అనేక మంది యువతీయువతులు గంటల తరబడి కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడుతున్నాయి. చివరికి అవి ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుతున్నారు. చిన్నవయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత ఎదురయ్యే ఆటుపోట్లను భరించలేక గొడవలు పడుతూ ఏడు అడుగుల్లోనే తమ బంధాలను ముగించుకుంటున్నారు. కొంతమంది జీవితంపై విరక్తి చెంది జీవితాలను చాలిస్తుండగా.. మరికొందరు మళ్లీ కొత్త వ్యక్తులతో ప్రయాణం చేస్తున్నారు.
కుటుంబాల్లో కంటతడి
సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న పెళ్లిళ్లు కుటుంబాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. పిల్లల నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. వారి ఆశలు ఒక్కసారిగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఇక చిన్న వయసులో తీసుకునే ఈ నిర్ణయాలు వారి చదువు, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చదువును మధ్యలోనే వదిలేసే పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు, విద్యావేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ వ్యసనం నుంచి వారు దూరమయ్యేలా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
హద్దులు దాటకూడదు
సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితుల్లో ఉంచాలి. అనుమానాస్పద పరిచయాలపై జాగ్రత్త వహించాలి. ఇటీవల ప్రేమ పెళ్లి పేరుతో మోసాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి. భావోద్వేగ నిర్ణయాలకు లోనుకాకుండా అవగాహన కల్పించాలి. సోషల్ మీడియా పూర్తిగా చెడు కాదు. సరైన మార్గంలో ఉపయోగిస్తే అది అవకాశాల ప్రపంచం. అదుపు లేకుండా వాడితే మాత్రం జీవితాలను దారి తప్పించే ప్రమాదం ఉంది. – అశోక్‌కుమార్, తాలూకా ఎస్‌ఐ, చిత్తూరు


