కిక్కిరిసిన కాణిపాకం | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కాణిపాకం

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కొనసాగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్లు నిండిపోయి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

త్వరితగతిన సంజీవిని

డేటా సేకరణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సంజీవిని డేటాను త్వరితగతిన సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డేటా అప్‌డేషన్‌పై కేసీడీ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ ప్రోగ్రాం అధికారులు, డీఐ ఎన్‌సీటీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవిని కార్యక్రమానికి సంబంధించిన డేటాను పూర్తి చేయడంపై చర్చించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో త్వరితగతిన డేటా సేకరణ ఎలా చేపట్టాలి, ప్రతి ఒక్కరికీ మొబైల్‌ నంబర్‌తో పాటు ఏబీ ఐడీల సృష్టి ఎలా సాధ్యమవుతుందనే అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఈ డేటా సేకరణ పూర్తయితే సమాజంలోని ప్రజలందరికీ వైద్య సేవలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు.

డెప్యుటేషన్‌పై

విజయవాడకు ఆర్‌ఐ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా మైనింగ్‌ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావ్‌ను డెప్యుటేషన్‌పై విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులొచ్చాయి. ఈయన త్వరలో అక్కడ బాధ్యతలు చేపట్టనున్నారు. మరో వారం రోజుల్లో ఈ స్థా నాన్ని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పకడ్బందీగా

నీట్‌ పరీక్ష విధులు

చిత్తూరు కలెక్టరేట్‌ : నీట్‌ పరీక్ష విధులను పకడ్బందీగా నిర్వహించాలని నీట్‌ పరీక్షల సిటీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జీవనజ్యోతి తెలిపారు. స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వైద్య విద్య కోర్సు లో ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలు పీవీకేఎన్‌లో 456 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220 మంది, లిటిల్‌ ఫ్లవర్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో 384 మంది మొత్తం 1,060 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష నిర్వహణలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సావిత్రమ్మ కళాశాల ప్రిన్సిపాల్‌ మనోహర్‌, లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ జెసిత, అబ్జర్వర్లు ప్రొఫెసర్‌ జానకిరామయ్య, అధ్యాపకులు నాగేంద్ర, శరవణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement