సీఎం సొంత జిల్లాలో పల్టీ కొట్టిన పది ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

సీఎం సొంత జిల్లాలో పల్టీ కొట్టిన పది ఫలితాలు

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

● రాష్ట్ర స్థాయిలో 24వ స్థానం ● ఫలించని ప్రత్యేక తరగతులు

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యాశాఖ అధికారుల ఏడాది మొత్తం చేసిన హడావుడి అంతా వట్టిమాటలేనని తేలిపోయింది. పది ఫలితాల్లో జిల్లా ఘోరంగా చతికిలపడింది. రాష్ట్ర స్థాయి 24వ స్థానానికి పడిపోయింది. గత విద్యాసంవత్సరంలో సైతం 24వ స్థానం, ప్రస్తుతం అదే స్థానంతో పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది. పొరుగు జిల్లాలైన అన్నమయ్య, తిరుపతి జిల్లాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రం మాత్రం వెనుకుబడిపోవడం గమనార్హం.

వైఫల్యంపై నిలదీత

సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖ అధికారుల వరకు అందరూ ఉన్నా, వెనుకబడిన విద్యార్థులను గుర్తించడంలో విఫలమయ్యారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలుతున్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని విద్యావేత్తలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

76.69 శాతం ఉత్తీర్ణత

జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 20,905 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 10,711, బాలికలు 10,194 మంది ఉన్నారు. బాలురు 7,630 మంది, బాలికలు 8,403 మంది ఉత్తీర్ణత చెందారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16,033 మంది ఉత్తీర్ణత కాగా 76.69 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

బాలికల హవా

ఫలితాల విశ్లేషణలో బాలురు బాలికలంటే వెనుకబడ్డారు. జిల్లాలో బాలురు 71.24 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నారు. బాలికలు మాత్రం 82.43 శాతంతో రాణించి జిల్లా పరువును కొంత మేర నిలబెట్టారు.

ముందంజలో

రెసిడెన్షియల్‌ పాఠశాలలు

జిల్లా వ్యాప్తంగా నమోదైన ఫలితాల్లో అన్ని యాజమాన్యాలలో రెసిడెన్షియల్‌ పాఠశాలలు 94.10 శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రైవేట్‌ పాఠశాలలు 91.53, బీసీ వెల్ఫేర్‌ 86.52, కేజీబీవీ 82.96, సోషల్‌ వెల్ఫేర్‌ 81.73, ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 80.08, జిల్లా పరిషత్‌ 71.79, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 71.25, ఎయిడెడ్‌ 70.11, ప్రభుత్వ యాజమాన్యం 62.53, మున్సిపల్‌ 59.54 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.

45 పాఠశాలల్లో

వంద శాతం ఫలితాలు

జిల్లా వ్యాప్తంగా 100కి 100 శాతం ఉత్తీర్ణత 45 పాఠశాలలు సాధించాయి. ప్రైవేట్‌ యాజమాన్యాల్లో 27, సోషల్‌ వెల్ఫేర్‌లో 1, జిల్లా పరిషత్‌లో 17 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా జిల్లాలో రెండు ప్రైవేట్‌ పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని వి.కోట మండలం ఇండస్‌ వ్యాలీ పాఠశాలలో 1 విద్యార్థి పరీక్ష రాయగా ఆ విద్యార్థి ఫెయిల్‌ అయ్యాడు. అలాగే నగరిలోని శ్రీరామ్‌ విద్యామందిర్‌లో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయగా ఆ ఇద్దరూ ఫెయిల్‌ అయ్యారు.

మొదట పాలసముద్రం,

చివర్లో సదుం

జిల్లాలో పాలసముద్రం మండలం 95.51 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సదుం మండలం 62.04 శాతంతో వెనుకబడింది. పూతలపట్టు 93.63, విజయపురం 89.81, ఐరాల 89.63, జీడీ నెల్లూరు 88.07, చౌడేపల్లి 84.47, గంగవరం 82.87, నగరి 82.06, నిండ్ర 80.93, పలమనేరు 80.43, ఎస్‌ఆర్‌ పురం 79.40, పుంగనూరు 79.35, చిత్తూరు 78.71, సోమల 77.72, పెద్దపంజాణి 77.66, బంగారుపాళ్యం 76.96, గుడిపాల 76.14, గుడుపల్లి 74.21, పులిచెర్ల 73.70, శాంతిపురం 73.63, వెదురుకుప్పం 73.49, బైరెడ్డిపల్లి 72.21, తవణంపల్లి 71.90, పెనుమూరు 71.77, కార్వేటినగరం 68.61, కుప్పం 66.10, వి.కోట 65.92, రొంపిచెర్ల 65.63 యాదమరి 64.59, రామకుప్పం 64.35, సదుం 62.04 శాతం ఫలితాలను సాధించాయి.

Advertisement
 
Advertisement
Advertisement