వేధిస్తున్న సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న సిబ్బంది కొరత

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్షర జ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు నిరుపయోగంగా మారుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాల కొనుగోలు లేక నిర్వీర్యమవుతున్నాయి. పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడనంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు సిబ్బంది కొరత తోడవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలు మూతపడే స్థితిలోకి వెళ్లిపోయాయి.

నిలువెల్లా నిర్లక్ష్యం

ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, కొత్త పుస్తకాల కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 71 గ్రంథాలయాలుండగా ఇందులో 54 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 12 అద్దె లేనివి, అద్దె చెల్లించేవి 5 వరకు కొనసాగుతున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలో గ్రంథాలయాలకు వెళ్తే అప్‌డేట్‌ పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. గ్రూప్స్‌ ప్రిపేర్‌ అయ్యేవారికి అవసరమైన పుస్తకాలు కనిపించడం లేదు. దీంతోపాటు బ్యాంకు పోస్టులకు సంబంధించిన మ్యాథ్స్‌, రీజనింగ్‌, అర్థమేటిక్‌ పుస్తకాలు కూడా అప్డేట్‌ చేసినవి లేవు.

కక్షగట్టి.. డిజిటల్‌ను పక్కనబెట్టి

గత పాలనలో మంజూరైనన డిజిటల్‌ గ్రంథాలయాల భవన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం సగంలోనే పనులు ఆపేసింది. వీటిని అసలు పట్టించుకోవడం లేదు. వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి. దినపత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్‌ తదితరాలను పూర్తిగా డిజిటల్‌ విధానం ద్వారా చదువుకునే వెసులుబాటు కల్పించాలనేది గత ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కానీ కూటమి వచ్చాక దీన్ని నిర్వీర్యం చేసింది.

గ్రంథాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా లైబ్రేరియన్‌, రికార్డు అసిస్టెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులు కలిపి మొత్తం 70 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. జిల్లాలో ఉన్న 71 గ్రంథాలయాల పరిధిలో 66,303 మంది సభ్యులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. లైబ్రేరియన్ల కొరత కారణంతో కొన్ని లైబ్రేరిన్‌లకు ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. మరోవైపు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న లైబ్రేరియన్‌లకు అదనపు పనిభారంతో పాటు ఆర్థిక భారం కూడా తోడవుతోంది.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సెస్‌ బకాయిలు రూ.43 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తిరుపతి కార్పొరేషన్‌ నుంచే రూ.22 కోట్లు, చిత్తూరు కార్పొరేషన్‌ రూ.5 కోట్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ రూ.3 కోట్లు, మిగిలిన మొత్తం మున్సిపాలిటీలు, పంచాయతీలు కలిపి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని కలెక్టర్లకు అధికారులు విన్నవిస్తూనే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కోనుగోలు, నిర్వహణ, పేపర్‌ బిల్లు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.

పేరుకుపోయిన బకాయిలు

Advertisement
 
Advertisement
Advertisement