సీనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సివిల్‌ జడ్జీల బదిలీ

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

తిరుపతి లీగల్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఏ.సునీతరాణి గుంటూరు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, మదనపల్లి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శిరీష్‌ను కర్నూలు జిల్లా నంద్యాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, శ్రీకాళహస్తి సీనియర్‌ సివిల్‌ జడ్జి బేబీరాణిని ప్రకాశం జిల్లా చీరాల సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా, నూజివీడు సీనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ పెద్దకాసీంను పీలేరు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, కృష్ణా జిల్లా విజయవాడ మొదటి అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మెస్‌ కరీముల్లాను మదనపల్లి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, గుంటూరు జిల్లా రేపల్లె సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌పీడీ వెన్నెలను తిరుపతి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. అలాగే జడ్జి వెన్నెలను తిరుపతి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తిగా కూడా నియమిస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన న్యాయమూర్తులు మే నెల 11వ తేదీ లోపు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది.

జేఎల్‌ఎంలుగా గుర్తింపు

చిత్తూరు కార్పొరేషన్‌: గత పాలనలో సచివాలయాల వ్యవస్థ ద్వారా విద్యుత్‌ సేవలందించడానికి ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌–2)లను నియమించారు. వీరి జీతభత్యాలు, పర్యవేక్షణ ట్రాన్స్‌కో ద్వారా నడుస్తోంది. అత్యవసర రంగంలో, సెలవు రోజుల్లోనూ సేవలందిస్తున్న వీరిని పలు ప్రభుత్వ సర్వేలకు వాడుకుంటున్నారు. దీంతో వారి విధి నిర్వహణకు అటంకం కలుగుతోంది. సర్వేల నుంచి మినహాయింపునివ్వాలని గతంలో జేఎల్‌ఎం–2లు కోరినా ఫలితం లేకుండా పోయింది. సర్వేలు చేయకుండా ఉన్నందుకు వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో సర్వేల నుంచి మినహాయింపునివ్వాలని, జేఎల్‌ఎంలుగా గుర్తించి పదోన్నతులు కల్పించడానికి అవకాశం కల్పించాలని న్యాయపోరాటం చేశారు. దీని పై వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇంధన ప్రత్యేక కార్యదర్శి విజయానంద్‌ వారిని విద్యుత్‌ సేవలకు మాత్రమే వినియోగించాలని కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. అలాగే వారికి జేఎల్‌ఎంలుగా గుర్తింపునిచ్చారు. దీంతో ప్రస్తుతం నెలకు వస్తున్న బేసిక్‌ రూ.24,500 జీతం త్వరలో రూ.30,800కు చేరనుంది. వీటితో పాటు ఇతర ప్రోత్సాహకాలు కలిపి మరో రూ.10 వేల వరకూ జీతం పెరగనుంది. జిల్లాలో 285 మంది లబ్ధి పొందనున్నారు. భవిష్యత్‌లో శాఖా పరంగా పదోన్నతులు రానున్నాయి.

విచారణ షురూ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కోవిడ్‌ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపడుతున్నారు. సాక్షి దినపత్రికలో ఇటీవల ‘కోవిడ్‌ నిధుల్లో చిలకొట్టుడు’ అనే శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విధితమే. దీనిపై జిల్లా అధికారులు పంపిన నివేదికల ఆధారంగా రాష్ట్ర స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. 14 నెలల కాలంలో జరిగిన మరిన్ని విషయాలను కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ బాగోతంలో మరో ఇద్దరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత కోసం బ్యాంకులో సీసీ పుటేజీలను కూడా పరిశీలించనున్నారని తెలుస్తోంది.

మార్పు కనిపించాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం ): వైద్య ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో మార్పు కనిపించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నాగశశిభూషణ్‌ రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ఏ సీడీ స్క్రీనింగ్‌లో రక్తపోటు, మధుమేహం అనుమానిత కేసుల గుర్తింపు, నమోదు, తదుపరి నిర్వహణలో కొన్ని పీహెచ్‌సీల పనితీరు, ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని డీఎంహెచ్‌వో తీవ్రంగా పరిగణించారు. జిల్లా సగటు 54 శాతం మాత్రమే నమోదవుతుండడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్‌సీ స్థాయిలో స్క్రీనింగ్‌, డయోగ్నోసిస్‌, ఫాలోఅప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. అలాగే చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఓపీ సెన్సస్‌ను తప్పనిసరిగా ఆన్‌న్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement