చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పారదర్శక విధానంలో, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలకు ఆన్‌లైన్‌లో అందిన 22 క్లెయిమ్‌లకు రూ.67,14,637 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గండ్రాజుపల్లి పారిశ్రామిక పార్కు, జీడీ నెల్లూరు పరిధిలో విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, ఎల్‌డీఎం హరీష్, జిల్లా నైపుణ్యశాఖ అధికారి గుణశేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష
కలెక్టరేట్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన డిజిటల్ నెర్వ్ సెంటర్ అద్భుత ఫలితాలను ఇస్తోందన్నారు. ఈ సమీక్షలో టాటా బృందం నుంచి డాక్టర్ శ్రీకాంత్, తపస్‌దాస్, డీఎంహెచ్‌వో శశిభూషన్‌రెడ్డి పాల్గొన్నారు.


