కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛనూ లేదు
రెండేళ్లుగా మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేలు పింఛన్ మంజూరు చేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నేటికీ ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. పింఛన్ కోసం అభాగ్యులు సచివాలయాలు, మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రెండేళ్లుగా మహిళలను వేపిస్తున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కార్వేటినగరం: ‘తమ్ముళ్లూ నేను ఒక్కటే చెబుతున్నా. మనం అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన నా అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు పింఛన్ మంజూరు చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పింఛన్ అందిస్తా’ నంటూ చంద్రబాబునాయుడు హామీలు గుప్పించారు. ఆపై అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ హామీని నిలబెట్టుకోలేక పోతున్నారు. కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారు.
62 వేల మంది ఎదురు చూపు
చిత్తూరు జిల్లాలో 50 ఏళ్లు వయస్సు దాటిన వారు 1,51,963 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు 94 వేల మందికి పైబడి ఉన్నారు. వీరిలో సుమారు 62 వేల మంది కొత్త పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబునాయుడు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారని వాపోతున్నారు.
గతంలో ప్రతీ ఆరు నెలలకు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లబ్ధిదారులను ఎంపిక చేసి కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందజేసింది. మొదటి మూడేళ్ల పాటు ప్రతి మూడు నెలలకోసారి చొప్పున అర్హులను ఎంపిక చేసి నూతన పింఛన్లు మంజూరు చేసేది. ఆ తర్వాత 2022–23లో ప్రతి ఆరు నెలలకు అర్హులైన వారు నష్టపోకుండా వలంటీర్లతో ఎంపిక చేసి పింఛన్లు అందజేసేవారు. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని పలువురు ప్రశ్ని స్తున్నారు.
చెప్పులు అరిగేలా తిరుగుతున్నా
నా భర్త ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీవనోపాధి కోసం నగరిలో తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. సచివాలయానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్‌కు దరఖాస్తును తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. దీన స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి కనికరం లేదు.
– కే.పార్వతి, వితంతువు, కొల్లాగుంట, కార్వేటినగరం
ఏడాదిన్నరగా ఎదురు చూపు
ఏడాదిన్నర కిందట భర్త చనిపోయాడు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతవులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయానికి తిరుగుతున్నా కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదు. ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అసలే ఎస్టీ కులానికి చెందిన వారము. ఇంటి పెద్దను పోగొట్టుకుని కూలికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని పోషించాల్సి వస్తోంది.
– వనిత, చాకలివానిగుంట, కార్వేటినగరం


