పలమనేరు: కౌండిన్య నదిలో నీరు తగ్గడంతో ఇసుక స్మగ్లర్లు మళ్లీ పేట్రేగుతున్నారు. ఇప్పటికే నదిలో దాదాపుగా ఇసుకను తోడేశారు. బయటి నుంచి మట్టిని ట్రాక్టర్లతో తెచ్చి కౌండిన్య నదిలో రాత్రిపూట పోసి ఆపై జేసీబీలతో నీటిలోని మట్టిని, ఇసుకను కలియతిప్పి దాన్ని ఉడ్డలుగా పోసి ఎండబెట్టడం లాంటివి చేస్తున్నారు. మరికొందరు నదికి ఆనుకుని ఉన్న గడ్డలను సైతం జేసీబీలతో తోడి ఇసుకను రాబడుతున్నారు. స్థానిక క్యాటిల్‌ఫామ్ సమీపంలోని ఫారెస్ట్‌శాఖ నగవరనానికి ఆనుకుని అక్కడున్న ప్రహరీగోడను సైతం కూల్చేశారు. పక్కనున్న వృక్షాలను వేర్లతోపాటు పెకిళించేశారు. అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కొట్టేశారు. కౌండిన్య నదిలో పగలు, రాత్రి తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారు. కౌండిన్య నది నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో కూటమి నేతలకు ఇదో మేతలా మారింది. ఈ ప్రాంతాల్లోని నదిలో జేసీబీలతో ఇసుకను తోడే దృశ్యాలు, ట్రాక్టర్లకు ఇసుకను నింపే కూలీలు, వాహనాల కోసం నదిలో ఏర్పాటు చేసుకున్న దారులు ఎటూచూసినా కనిపిస్తుంటాయి.
నది పక్కనున్న గడ్డ మట్టిని సైతం..!
ఉచితంగా ఇసుకను తోడుకోమని సీఎం చంద్రబాబే చెప్పారనే మాటతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నదికి పక్కగా ఉన్న మట్టిని నదిలోని నీటిలో వేసి రాత్రుల్లో దాన్ని జేసీబీతో కలియతిప్పుతూ ఫిల్టర్ చేసి ఇసుకను తోడుతున్నారు. నదికి ఆనుకుని ఉన్న గ్రామాలకు చెందిన అక్రమార్కులకు ఇదో వృత్తిలా మారింది. ఇక్కడి ప్రతి గ్రామంలో ఇసుక తోలే ట్రాక్టర్లు, జేసీబీలు భారీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోజుకు వంద ట్రాక్టర్ల ఇసుక తరలింపు
నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎంతలేదన్నా రోజుకు వంద ట్రాక్టర్ల ఇసుక వెళుతోంది. ఇసుకాసురులు అటు అధికారులు, ఇటు పోలీసులు చూసినా భయపడడం లేదు. ఇసుక తరలించే ట్రాక్టర్‌ను అడ్డుకునే ధైర్యం పో లీసులకు లేకుండా పోయింది. పట్టపగలే హైవేలో ఇసుకట్రాక్టర్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇసుక తవ్వకాల కోసం ఫారెస్ట్ శాఖ నగరవనం చెట్లను కొట్టేసిన దృశ్యం
నదిలో ఎటూచూసినా ఇసుక తవ్వకాలే


