– రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాయనిచెరువు వెళ్లే మార్గంలో దిగవూరు క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిసిన వివరాల మేరకుం.. చిత్తూరు మండలంలోని తుమ్మింద గ్రామానికి చెందిన రవి తేజ(19), అదే గ్రామానికి చెందిన ఆకాష్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నాయనిచెరువు గ్రామంలో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆటో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న రవితేజ గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా తాకి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న ఆకాష్ కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే గుర్తించిన స్థానికులు ఇద్దరినీ గుడిపాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవితేజ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆకాష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగండన్‌గా గుర్తించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


