వినియోగదారుల ఇంటికి చేరాలంటే అష్టకష్టాలు ఇరాన్ యుద్ధ ప్రభావంతో అవస్థలు వేధిస్తున్న ఓటీపీ, బుకింగ్ సమస్యలు తాజాగా ఈకేవైసీ తెరపైకి ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న ప్రజలు పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి కింద దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, ఎల్‌పీజీ కనెక్షన్లు 5,09,116, కమర్షియల్ కనెక్షన్లు 2,930 వరకు ఉన్నాయి. రోజువారీగా వేలల్లో గ్యాస్ బండలు అమ్ముడవుతున్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సరఫరాకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా హోటళ్లకు గ్యాస్ దొరకడం కష్టతరంగా మారుతోంది. అందరి చూపు వంట గ్యాస్‌పై పడింది. బ్లాక్‌లో విక్రయాలు పెరిగాయి.
సిలిండర్ రూ.5 వేలు?
గ్యాస్ కొరత కారణంగా బండ వ్యాపారం బహిరంగంగా జరుగుతోంది. బ్లాక్‌లో గ్యాస్ విక్రయాలు జోరందుకున్నాయి. రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హోటళ్ల నిర్వహణ కోసం నిర్వాహకులు బ్లాక్‌లో రూ.5 వేల వరకు వెచ్చిస్తున్నట్ట సమాచారం. పలు చోట్ల దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్‌లపై నెట్టేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
బుకింగ్ కావడం లేదు భయ్యా?
నెల రోజులుగా చాలా మంది వంటగ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కావడం లేదని కార్యాలయాలను చుట్టుముడుతున్నారు. అక్కడికి వెళ్లిన వారికి చిత్తు పేపర్లో ఫోన్ నంబర్లు రాసి ఇచ్చి పంపిస్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నంబర్లు కూడా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో కొందరు పొయ్యితోనే కుస్తీపడుతున్నారు. మరి కొంతమందికి బుకింగ్ చేసినా ఓటీపీ రావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు.
ఈకేవైసీ బూచీ!
ఓటీపీ, బుకింగ్ సమస్యలతో పాటు తాజాగా ఈకేవైసీ సమస్య కూడా తోడైంది. జిల్లాలో 1.30 లక్షల మంది ఈకేవైసీ చేయించుకోలేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒకవైపు బుకింగ్ సమస్య, మరోవైపు ఈకేవైసీ సమస్యతో ఏజెన్సీలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట అంటూ ఇన్నాళ్లు లేని ఈకేవైసీని ఇప్పుడు బూచీగా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటీపీ లేకుండా జరిగిన గ్యాస్ బుకింగ్‌ను కప్పిపుచ్చేందుకే ఈకేవైసీని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు తయారైంది జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి. అమెరికా–ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఓటీపీలు లేకుండానే డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్‌లో అమ్మేస్తున్నారు. గ్యాస్ బుక్ చేద్దామన్నా వీలుకాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడిచ్చే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా గ్యాస్ బుక్‌గాక ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ నిర్వాహకులు ఈకేవైసీనీ తెరపైకి తెచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు కట్టెల పొయ్యిపైనే కుస్తీ పడుతూ కాలం నెట్టుకొస్తున్నారు.
ఓటీపీ దొంగలతో కుమ్మక్కు
గుడిపాలలో వెలుగుచూసిన ఓటీపీ దోపిడీపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటీపీ లేకుండా ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్చి 23న 270 గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అమ్మినట్లు సమాచారం. ఈ సిలిండర్లను గుడిపాల, బంగారుపాళ్యం మండలాల్లో విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీసాక్షిశ్రీ కథనాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను రాతపూర్వకంగా నమోదు చేసి జిల్లా యంత్రాంగానికి నివేదికగా సమర్పించారు. అనంతరం ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. అయితే తర్వాత ఆ దందాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరినట్టు సమాచారం. ఆ శాఖ అధికారులకు కూడా మామూళ్లు అందాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జిల్లాలో గందరగోళంగా గ్యాస్ సరఫరా


