రమణీయం.. ఆదిదంపతుల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. ఆదిదంపతుల కల్యాణం

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 2:40 PM

 Vedic scholars performing the marriage Lord Shiva and Parvati

శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం

భారీగా తరలివచ్చిన భక్త జనం

ఒక్కటైన 59 కొత్త జంటలు

ఆదిదంపతుల కల్యాణం భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. పార్వతీ, పరమేశ్వరులు బహిరంగంగా జరుపుకున్న వివాహ మహోత్సవం భక్తజన కోటిని పరవశింపజేసింది. అశేష భక్తజన వాహిని మధ్య ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. బుధవారం తెల్లవారు జామున సుమారు 4.30గంటల సమయంలో జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరుడు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ మాంగల్యధారణ చేశారు. ఇదే శుభ ఘడియల్లో ఆదిదంపతుల సమక్షంలో 59 నూతన జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యాయి.

శ్రీకాళహస్తి: ముక్కంటి క్షేత్రంలో పెళ్లి కళ ఉట్టిపడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున ఆదిదంపతుల కల్యాణం కమనీయంగా సాగింది. అంతకు ముందు మంగళవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అధిష్టింపజేసి పెండ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు.

అలిగితివా సఖీ!

పెండ్లి మండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరు కోగా.. మధ్యలో పార్వతీదేవి అలకబూనడంతో చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం చేసి అమ్మవారి అలక తీర్చారు. సంతృప్తి చెందిన జ్ఞానప్రసూనాంబ పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి పెళ్లి పీటలపై ఆశీనులయ్యారు. వేదపండితులు కలశ స్థాపన చేశారు. సంకల్పం, యజ్ఞాహుతి పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆదిదంపతుల కల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు. శివపార్వతుల పెళ్లిని వీక్షించడానికి భక్త జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరి వీధి, నెహ్రూ వీధి భక్తులతో నిండిపోయాయి. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఒక్కటైన నూతన జంటలు

స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా 59 నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. జ్ఞానప్రసూనాంబ దేవికి స్వామి వారు మాంగల్యధారణ చేసిన సమయంలోనే ఈ జంటలు ఒక్కటయ్యాయి. బుధవారం ఉదయం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి రుద్రాక్ష, చప్పరాల వాహనాలపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

ఆగమోక్తంగా నటరాజస్వామి కల్యాణం

మహాశివరాత్రి వార్షికోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి సభాపతి కల్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. దక్షయజ్ఞ సమయంలో సతీవియోగంతో పరమేశ్వరుడు యోగధ్యానంలోకి వెళ్లడంతో సర్వలోకాలు తల్లడిల్లిపోయాయి. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని సంతానంతో మాత్రమే మృత్యువు పొందే విధంగా వరాన్ని పొందుతాడు. శివునికి సతీదేవి లేదని.. వివాహం జరగదని తలచిన తారకాసురడు తన వికృత రూపం చూపుతాడు. అదే సమయంలో స్కందుని ధ్యానంతో పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆ సమయంలో నటరాజస్వామికి, శివకామి సుందరికి దేవతలు ఘనంగా వివాహం జరుపుతారు. ఈ వేడుకలను ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని 16 కాళ్ల మండపం వద్ద పురోహితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శివకామసుందరి సమేత నటరాజస్వామి పురవీధుల్లో ఊరేగారు.

నేడు గిరిప్రదక్షిణ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తమ కల్యాణానికి వచ్చిన రుషులు, దేవతలను శివయ్య విల్లంబులు ధరించి వారివారి స్థావరాలకు చేర్చనున్నారు. దీన్నే రుషిరాత్రి అని కూడా అంటారు. గిరి ప్రదక్షిణ తర్వాత పట్టణానికి తిరిగి వచ్చే స్వామి, అమ్మవార్లకు భక్తులు వేలాదిగా ఎదురుసేవ మండపం వద్దకు చేరుకుని స్వాగతం పలకనున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఉభయదారుగా వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement