చెరువు స్థలంలో సైకిల్ సవారీ!
చేపల పెంపకానికి కేటాయించిన ప్రభుత్వ స్థలం స్వాధీనం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చంద్రబాబు పాలనలో చిత్తూరు ప్రజలకు శ్రీచెరువుల కబ్జాశ్రీ రూపంలో షాక్ తగిలింది. ఏకంగా గాండ్లపల్లె (కట్టమంచి) చెరువు అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. దశాబ్దాల కాలంగా ప్రభు త్వ అవసరాలకు మత్స్య శాఖకు కేటాయించిన ఈ భూమిని, ఇప్పుడు అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి లీజుకు ఇవ్వడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలేమిటని జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు.
అధికార మదంతో ఆక్రమణల పర్వం?
చిత్తూరు నగర నడిబొడ్డున ఉన్న కట్టమంచి చెరువు ఒకప్పుడు ఈ ప్రాంతానికి జలకళను పంచిన అపురూప వనరు. 1970వ దశకంలో చేపల పెంపక కేంద్రం కోసం సబ్ డివిజన్ చేసిన ఈ భూమిని, ఇప్పుడు ‘నిర్వహణ లేని శిథిలం’ అనే సాకుతో పార్టీ కార్యాలయానికి కట్టబెట్టడం అత్యంత దుర్మార్గుమైన చర్య. టీడీపీ నాయకులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఆగమేఘాల మీద ప్రతిపాదనలు పంపించి, లీజు ప్రక్రియను పూర్తి చేయడం వెనుక ఉన్నది కేవలం అభివృద్ధి కాదు, అది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న భూ దోపిడీ అని స్థానికులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
కోర్టు తీర్పు ఏమైనట్టో?
నీటి వనరులు, చెరువు పోరంబోకు స్థలాల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని,సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పదేపదే హెచ్చరిస్తున్నాయి. అయితే, ఈ నిబంధనలు అధికార పార్టీ ఖాతరు చేయడం లేదు. చెరువు శిఖం భూమిలో పార్టీ జెండా పాతడం అంటే, పర్యావరణానికి సమాధి కట్టడమే. కలెక్టర్ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు సైతం ఈ అక్రమ కేటాయింపులకు ఎలా పచ్చజెండా ఊపుతారని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
అదనపు ఆశ ఎందుకు?
టీడీపీకి ఇప్పటికే నగరంలో అన్ని సౌకర్యాలతో కూడిన భవనం ఉంది. ఆ భవనం ఉండగా, మళ్లీ చెరువు భూమిపై పడడం కేవ లం పార్టీ అవసరాల కోసం కాదు, అది భవిష్యత్తులో ఆ విలువైన భూమిని స్వాధీనం చేసుకునే ఎత్తుగడ అని స్పష్టమవుతోంది. ఒకవేళ పార్టీ కార్యాలయాలకు భూములు ఇవ్వడమే ప్రభుత్వ విధానం అయితే, జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు కూడా అదే చెరువు స్థలంలో వాటాలు ఇస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పర్యావరణ ప్రేమికుల ఉద్యమ హెచ్చరిక!
ఈ నెల 22న వివాదాస్పద స్థలంలో భూమి పూజ నిర్వహించేందుకు పచ్చ చొక్కాల సైన్యం సిద్ధమవుతోంది. ఈ చర్యను అడ్డుకోవడానికి జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు ఇప్పటికే న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఎన్జీటీలో కేసు వేసి, ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆ పార్టీ నేతలు (ఫైల్), గతంలో ఉన్న మత్స్యశాఖ భవనం (ఫైల్)
అధికారుల అత్యుత్సాహం!
పర్యావరణాన్ని కాపాడాల్సిన జిల్లా యంత్రాంగం, నిబంధనలను పక్కనబెట్టి ఆ స్థలాన్ని ఒక రాజకీయ పార్టీకి ఎలా ధారాదత్తం చేస్తోంది? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం శిథిలమైతే, ఆ స్థలాన్ని మళ్లీ ప్రభుత్వ అవసరాలకో లేదా ప్రజా ప్రయోజనాలకో వాడాలి గానీ, పార్టీ జెండా పాతడానికి ఎలా అనుమతిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానాలు చెప్పి తీరాలని నగరవాసులు, పర్యావరణ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ జరిగే ఏ నిర్మాణాన్ని సహించేది లేదని పలువురు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
చెరువు స్థలంలో సైకిల్ సవారీ!


