దర్జాగా మట్టి దోపిడీ
కుప్పం : అధికారం చేతిలో ఉంటే.. నో రూల్స్.. శనివారం కుప్పం అధికార పార్టీ నేతలు పట్టపగలు పట్టణం నడి బొడ్డున చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టారు. కుప్పం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాయకులు బరితెగించి మట్టి దందా చేపట్టారు. చెరువు సమీపంలోని గ్రామస్తులు అడ్డుపడినా డోంట్ కేర్ అంటూ మట్టి తరలించేశారు.
పట్టణ నడిబొడ్డు జాతీయ రహదారి పక్కన ఉన్న కుప్పం చెరువులో అధికార పార్టీ నేతలు చెలరేగి మట్టి తవ్వకాలు చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా పట్ట పగలు భారీ వాహనాలతో తవ్వకాలు చేపట్టారు. రెండు ఇటాచ్‌లు, 4 జేసీబీలు, 100 ట్రాక్టర్లు ఇష్టానుసారంగా మట్టి దోచేశారు. అధికార పార్టీ నేతల ఇటుకల తయారీ, రియల్ ఎస్టేట్ లే అవుట్ చదును కోసం భారీ ఎత్తున వాహనాలు పెట్టి దర్జాగా మట్టిని తరలించారు. కుప్పం చెరువు మొత్తం వాహనాలు నిండిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లుతో మట్టి తరలించారు.
అధికారులు ఒకరిపై ఒకరు..
కుప్పం చెరువులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే అధికారే లేరు. రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేస్తే..ఇరిగేషన్ శాఖ సంబంధించి ఒకరిపై ఒకరు చెప్పుకుని కాలం వెలిబుచ్చారు. ఈ చెరువు పక్కనే ఉన్న బాబునగర్ గ్రామస్తులు ఒకే రోజు భారీ సంఖ్యలో వాహనాలు పెట్టి మట్టి తవ్వకాలు చేపట్టడం సరికాదని అడ్డుపడ్డారు. మా గ్రామంలో ఓం శక్తి ఆలయం చదునుకు 10 లోడ్‌ల మట్టి కావాలంటే అధికారులు ఒప్పుకోలేదు. ఇప్పుడు వందల సంఖ్యలో వాహనాలు పెట్టి ఇష్టానుసారంగా మట్టి తరలించుకుపోతున్నా ప్రశ్నించిన పాపాన పోలేదు. పట్టపగలు చెరువులో అధిక సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు, ఈటాచీలు పనిచేస్తున్నా...నిలిపి వేయాల ని 100 మంది గ్రామస్తులు రోడ్డెక్కి అభ్యంతరం వ్యక్తం చేసినా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కప్పేసిన దుమ్ము
పట్టణంలోని చెరువులో ఒక్కసారి భారీ వాహనాలతో మట్టి తవ్వకాలు చేపట్టడంతో దుమ్ము పట్టణాన్ని కప్పే సింది. చెరువు కట్టనుంచి బాబునగర్, గుడుపల్లె రోడ్డు , కుప్పం పట్టణ వీధుల వెంట ట్రాక్టర్లుతో మట్టి తరలిస్తుండడంతో రోడ్డుపై మట్టి నిండిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
కుప్పం చెరువులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు
ఇటాచీలతో ట్రాక్టర్లకు మట్టి నింపుతున్న దృశ్యం
దర్జాగా మట్టి దోపిడీ


