108లో సమ్మె సైరన్ !
నిరసనలో ఉద్యోగులు
డిమాండ్లపై పోరాటం
పరిష్కరించకుంటే సమ్మెకు సన్నద్ధం
అధికారులకు సమ్మె నోటీసులు
సోమవారం వరకు సమ్మె గడువు
కాణిపాకం : అత్యవసర వైద్యం అవస్థల్లో కూరుకుపోతోంది. సేవలు అందించే 108 వ్యవస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. ఆపద్భాందవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యలు పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మె సైరన్ మోగిస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 33 ఉన్నాయి. వీటి లో 70 మంది ఈఎంటీ, 75 పైలెట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతి నెలా వేల సంఖ్యలో క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే భేదం లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఈ వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కొన్ని నెలలుగా 108 ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. 108లో పనిచేసే ఈఎంటీ, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతోంది. సూపర్ వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. గతంలో మూడు మాసాల వేతనాలు మంజూరు చేయలేదు. వెరసి ఉద్యోగులకు ఆకలి కేకలు తప్పలేదు. దాదాపు 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ, డీఆర్వో, ప్రజాప్రతినిధులు, 108 కోఆర్డినేటర్ కార్యాలయాల్లో 108 ఉద్యోగులు అందజేశారు. తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సోమవారం తర్వాత ఏ క్షణమైనా 108 వాహనాలను నిలుపుదల చేసి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
సెలవులు ఏవీ..
108 సిబ్బంది అత్యవసర విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు రోజుకు దాదాపు 12 గంటల పాటు పనిచేయాలి. అదనంగా చేసే పనికి ఎటువంటి ఆదనపు చెల్లింపులు ఇవ్వడం లేదు. ఒక్కో వాహనానికి కనీసం ఆరుగురు ఉద్యోగులు రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నారు. ఏ ఉద్యోగీ వారాంతపు సెలవు తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పండుగల సెలవులను మర్చిపోయారు. డ్యూటీ వేసిన మరుక్షణం వెళ్లి పోవాల్సిందే. అంత యాతన అనుభవించి పనిచేస్తున్నా ప్రభుత్వం కనికరంలే కుండా వ్యవహరిస్తోంది.
సమస్యలు పరిష్కారం కాక ఉద్యమబాట
చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో 108 ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆరు మాసాల క్రితం ఆందోళనకు దిగిన ఉద్యోగులను బుజ్జిగించి, సమస్యలకు పరిష్కారం చూపుతామని నమ్మబలికిన ప్రభుత్వం నేటికీ వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో చేసేది లేక తిరిగి సమ్మెకు దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సోమవారం నుంచి సమ్మె లోకి వెళతామని 108 సంఘం వెల్లడించింది.


