బరితెగింపు
రైల్వే పనుల పేరిట..
చెరువు మట్టి దోపిడీ
ఎడ తెరిపి లేకుండా పనిచేస్తున్న ఇటాచీలు, జేసీబీలు
మట్టి తొలగించడంతో చెరువులో
పెద్ద గుంతలు
వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు
గోతులమయంగా నెత్తం కండ్రిగ చెరువు
నగరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకృతి వనరుల పరిరక్షణ అటకెక్కింది. దీంతో జాతీయ రహదారి, రైల్వే పనుల సాకుతో ఇప్పటికే గ్రావెల్, ఇసుకను ఇష్టానుసారం తరలించేస్తున్న అక్రమార్కులు చెరువు మట్టిని కూడా వదలడం లేదు. రైల్వే పనులకు మట్టి అవసరమంటూ నెత్తం కండ్రిగ చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తరలించేస్తున్నారు. ఇటాచీ, జేసీబీల సాయంతో 30 నుంచి 40 అడుగుల లోతు గుంతలు తీస్తూ మట్టిని టిప్పర్లలో తరలించేస్తున్నారు. దీంతో నెత్తం కండ్రిగ చెరువు మొత్తం గోతులమయంగా మారింది. మన ప్రాంతంలో వేసే రైల్వే పనులకే కదా అని పట్టించుకోని గ్రామస్తులు వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుండడంతో సందేహం వచ్చి శనివారం చెరువును పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు. చెరువులో పెద్ద గుంతలు తవ్వేసి ఉండటం చూసి ఆగ్రహావేశాలకు లోనయ్యారు. మట్టి తవ్వుతున్న వాహనాలను అడ్డుకున్నారు. 30 నుంచి 40 అడుగుల గోతులు తవ్వేశారని వర్షాలకు చెరువు నిండే సమయంలో గోతులు తెలియక మనుషులు , పశువులు దిగితే ఎంత ప్రమాదకరమో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేసినవారిలో గ్రామస్తులు రమేష్ రెడ్డి, ధనపాల్‌రెడ్డి, దేవరాజులు, పురుషోత్తం, కుప్పుస్వామి, పీతాంబరం తదితరులు ఉన్నారు.
వాహనాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు
చెరువులో తవ్వేసిన రాక్షస గోతులు
బరితెగింపు
బరితెగింపు


