కుప్పంలో తమిళ పోలీసుల హల్‌చల్
● అంతర్రాష్ట్ర దొంగల కోసం గాలింపు ● ఓ వ్యక్తిని పట్టుకుపోయిన వైనం
కుప్పం రూరల్: కుప్పంలో సోమవారం తమిళ పోలీసులు హల్‌చల్ చేశారు. తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, ఈరోడ్ తదితర పట్టణాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తుల మూలాలు కుప్పంలో ఉన్నట్లు నిర్థారించుకుని ఇక్కడ వేట ప్రారంభించారు. పట్టణంలోని మర్రిమానువీధికి చెందిన అలిగిరి అనే వ్యక్తిని అనుమానితునిగా గుర్తించి పట్టుకెళ్లారు.
తమిళ పోలీసుల చూపంతా కుప్పం వైపే..!
తమిళనాడు రాష్ట్రంలో ఏవైనా దొంగతనాలు చోటు చేసుకుంటే అక్కడి పోలీసులు కుప్పం వైపు అనుమానంగా చూడటం కొత్తేమీ కాదు. మూడు దశాబ్దాల క్రితం ఓ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కుప్పం చుట్టుపక్కల స్థిరపడ్డాయి. దొంగతనాలు, దోపిడీలు చేయడమే వారి వృత్తి. స్థానికంగా ఉండటం మూలాన ఇక్కడ మాత్రం దొంగతనాలకు పాల్పడకపోవడం గమనార్హం! అదే తమిళనాడులోని దూర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసి కుప్పంలో వచ్చి దాక్కుకుంటున్నారు. అక్కడ కేసులు నమోదైతే పోలీసులు దొంగల కోసం గాలిస్తూ కుప్పం వస్తారు. ఇప్పటికే పలుమార్లు తమిళ పోలీసులు కుప్పం వచ్చి ఆ తెగకు సంబంధించిన వారిని పట్టుకుని వెళ్లారు కూడా. ఇదే క్రమంలో సోమవారం సైతం వేలూరు ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనం దర్యాప్తు కోసం తమిళ పోలీసులు కుప్పం వచ్చారు. 40 తులాల వరకు చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది కుప్పంలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేక తెగకు చెందిన మహిళలుగా గుర్తించారు. మర్రిమానువీధికి చెందిన వ్యక్తిని తమ వెంట పట్టుకెళ్లారు.
కూటమి నేతల రాజీయత్నాలు!
ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతలు పోలీసులు, దొంగల నడుమ మధ్యవర్తిత్వం చేస్తూ ప్రతిఫలంగా పెద్దమొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు మూటకట్టుకుంటున్నారు. దొంగలు సైతం కేసులకు భయపడి వారు అడిగినంత సమర్పిస్తున్నారు. దీంతో ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతల పంట పండినట్లేనని ఇక్కడి ఘటనలు చెబుతున్నాయి.


