ఒలింపిక్‌లో స్వర్ణమే లక్ష్యం
● ఇప్పటికే జర్మన్ మథాయ్ కిక్ బాక్సింగ్‌లో గెలుపు ● జాతీయ స్థాయిలో రెండు పతకాలు ● ఒలింపిక్ వైపు దూసుకెళ్తున్న అన్వేష్
కుప్పంరూరల్: అసలే పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. తల్లి బెంగళూరులో కూరగాయల వ్యాపారం. తండ్రి చిరు వ్యాపారి. కానీ ఎక్కడ కుంగిపోలేదు. కిక్ బాక్సింగ్‌లో ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే రెండు జాతీయ, మరో మూడు క్లబ్‌స్థాయి పతకాలు సాధించాడు. తాజాగా జర్మనీలో జరిగిన ఫిబో మథాయ్ పోటీల్లో సిల్వర్ పథకం సాఽధించాడు. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు కుప్పం మండలం, పైపాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అన్వేష్.
ఇంతింతై..!
అన్వేష్ తల్లి దవళేశ్వరి బెంగళూరులో కూరగాయల వ్యాపారం, తండ్రి ప్రభాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహాయకారిగా జీవనం సాగిస్తున్నారు. అన్వేష్‌కు మొదటి నుంచి కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే కిక్ బ్యాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. అతని ఆశయం, ఆలోచన గుర్తించిన తండ్రి ప్రభాకర్ ఆ దిశగా ప్రోత్పాహం అందించాడు. ప్రస్తుతం కుప్పం వికాస్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్వేష్‌కు వారాంతం శని, ఆదివారాల్లో బెంగళూరులోని ఏకేఎఫ్‌సీ అకాడమీలో కోచ్ కుమార్ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నాడు. గత మూడేళ్లలో రాటుదేలాడు. 2023లో కనకపురలో నేషనల్ చాంపియన్ షిప్, 2024లో మైపూరులో జరిగిన నేషనల్ చాంపియన్ షిప్‌లో అన్వేష్ సిల్వర్ మెడల్ సాధించాడు. క్లబ్ స్థాయిలో జరిగిన పోటీల్లో ఇప్పటికే ఒక గోల్డ్, 2 సిల్వర్ మెడళ్లు సాధించాడు.
ఫిబో మెడల్‌తో గుర్తింపు...
2024 ఆగస్టులో జర్మనీలో జరిగిన మథాయ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో అన్వేష్ సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో ఒక్కసారిగా కిక్ బాక్సింగ్ అభిమానుల కళ్లన్నీ అన్వేష్‌పై పడ్డాయి. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతున్నాడు. కనీసం స్పోర్ట్స్ ష్కాలర్‌షిప్‌లైనా అందించాలని కోరుతున్నారు.
జర్మనీ ఫిబో చాంపియన్ ఫిప్పులో బహుమతి సాధించిన అన్వేష్
విజేందర్‌సింగ్ నాకు ఆదర్శం
2008 బీజింగ్ ఒలింపిక్‌లో కిక్ బాక్సింగ్‌లో పతకం సాధించిన విజేందర్ సింగ్ బెనివాల్ నాకు ఆదర్శం. ఆయన తరహాలో కిక్ బాక్సింగ్‌లో రాణిస్తా. దేశానికి, తల్లిదండ్రులకు పేరు తేవాలని ఉంది. ఇప్పటికే బెంగళూరులోని అన్ని క్లబ్బు స్థాయిల్లో రాణించా. జాతీయ స్థాయిలో మూడు పథకాలు సాధించా. ఒలింప్‌లో పథకం సాధించడమే లక్ష్యం.
– అన్వేష్, యువ బాక్సింగ్ క్రీడాకారుడు, పైపాళ్యం
ఒలింపిక్‌లో స్వర్ణమే లక్ష్యం
ఒలింపిక్‌లో స్వర్ణమే లక్ష్యం


