సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేయింబవళ్లు యంత్రాలతో తవ్వి సుమారు 15 టిప్పర్ల ద్వారా ఇసుకను హైవే మీదుగానే సరిహద్దులు దాటిస్తున్నారు. ఐరాల మండలంలోని బహుదా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మైనగుండ్లపల్లె సమీపంలోని బహుదానదిలో నడిబొడ్డున(మధ్యలో) హిటాచ్ యంత్రాలతో సుమారు 20 అడుగుల లోతు మేరకు నీటిలో నుంచి ఇసుకను తవ్వి టిప్పర్లకు లోడ్ చేసి, హైవే మీదుగానే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
అండుగంటుతున్న భూగర్భ జలాలు
వర్షాకాలంలో బహుదానది ఒక సంవత్సరం ప్రవహిస్తే మూడేళ్ల పాటు పరిసర గ్రామాల్లో వ్యవసాయబోర్లు, తాగునీటి బోర్లలో భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో రైతులు పంట సాగు చేసుకోవడానికి నీటి కొరత ఉండదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బహునదిలో 20 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిద్రావస్థలో అధికార యంత్రాంగం
బహుదానదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయం. రేయింబవళ్లు యథేచ్ఛగా టిప్పర్లతో తరలిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం నిద్రావ్యవస్థలో జోగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారుల మొద్దు నిద్ర వీడి బహుదా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నీవానదిలో..
గంగాధరనెల్లూరు: నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని నీవానదిలో ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు. చిత్తూరు మార్గంలోని నీవానదిపై ఉన్న బ్రిడ్జికి నూరు మీటర్ల దూరంలో నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రానికి కూత వేటులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
బహుదానది.. ఆగని ఇసుక దందా