
పరిపూర్ణం.. కోన సంబరం
రాపూరు : పెంచలకోనలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉదయం శ్రీవారి చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లతోపాటు చక్రతాళ్వార్‌ను పల్లకిలో కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీవారి నందన వనంలోని పుష్కరిణి వద్ద మండపంలోకి వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ పుష్కరిణిలో చక్రతాళ్వార్‌కు స్నానం చేయించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి తన్మయత్వం చెందారు. మూడుసార్లు చక్ర స్నానం చేయించారు.
తెప్పోత్సాహం
శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నృసింహస్వామి ఉభయనాంచారులతో కలసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 10 గంటలకు స్వామివారిని అశ్వవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిపించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. కార్యక్రమాల్లో కార్యక్రమంలో డీసీ విజయసాగర్‌బాబు, ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ెఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు.

పరిపూర్ణం.. కోన సంబరం