SC On Check Bounce Case: చెక్‌ బౌన్స్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Your Cheque Your Responsibility Even If Someone else Fills Details SC - Sakshi

మీ చెక్కు, మీ బాధ్యత: సుప్రీం కోర్టు పరిశీలన

మరొక వ్యక్తి వివరాలు పూరించినా  బాధ్యత చెక్‌ ఇచ్చిన వారిదే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: చెక్‌ బౌన్స్‌ కేసులో అత్యున్నత న్యాయస్థానంకీలక వ్యాఖ్యలు చేసింది. చెక్కు బాధ్యత ఇచ్చిన వారిదే అని తెలిపింది. మీరు కాకుండా వేరే ఎవరైనా వివరాలను పూరించినా, చెక్కుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెక్ బౌన్స్ కేసును విచారించిన జస్టిస్ డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పినట్టు లైవ్‌లా నివేదికను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది.

చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి, సంబంధిత వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా చెక్‌ ఓనర్‌పై ఉంటుంది. అయితే  చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి చెక్కుపై వివరాలు నమోదు చేయలేదని  తేల్చిన చేతివ్రాత నిపుణుడి నివేదికను  అగౌరవపర్చ లేమని కోర్టు  తెలిపింది.  కానీ  చెక్కులోని వివరాలను డ్రాయర్‌  ఫిల్‌ చేశారా, లేదా  ఎవరు చేశారనేది  సంబంధం లేదని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో నిందితుడు చెల్లింపుదారునికి సంతకం చేసిన ఖాళీ చెక్కు ఇచ్చినట్లు అంగీకరించాడు. కానీ వివరాలు నమోదు చేయలేదని వాదించాడు. అలాగే దీన్ని నిర్ధారించడానికి చేతివ్రాత నిపుణుడి సలహా తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి కూడా తీసుకున్నాడు. చేతివ్రాత నిపుణుల నివేదికను జోడించాడు. అయితే దీనిపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. అలాగే వివరాలు ఎవరు నమోదుచేశారు, అప్పుగా ఇచ్చారా, మరోలా ఇచ్చారా అనేవిషయాన్ని నిర్ధారించడంలో చేతిరాత నిపుణుడి రిపోర్టు పాత్ర ఉండదని తెలిపింది. చెక్కుపై సంతకం చేసి, చెల్లింపుదారునికి ఇచ్చే చెక్‌ రుణం చెల్లించడం లేదా లయబిలిటీ  నిమిత్తం ఇచ్చినట్టు రుజువు చేయబడితే తప్ప బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 

కాగా చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ఐదు రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్‌ఐ చట్టం కింద కేసుల సంఖ్య గణనీయంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఒక్కో కోర్టు ఏర్పాటు చేయాలన్న అమికస్ క్యూరీ సిఫార్సును అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్‌ఐ) కింద, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల దృష్ట్యా, ఈ కోర్టులు ఏర్పాటు చేస్తామని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రకటించిన  సంగతి విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top