ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత | Wont raise stake in Vodafone Idea Jyotiraditya Scindia | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత

Apr 27 2025 7:36 AM | Updated on Apr 27 2025 7:39 AM

Wont raise stake in Vodafone Idea Jyotiraditya Scindia

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌)లో వాటాలను మరింతగా పెంచుకుని, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 48.99 శాతం వాటాలకే ప్రభుత్వం పరిమితమవుతుందని తెలిపారు. కేంద్రం తన వంతు తోడ్పాటు అందించినందున ఇకపై పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత వొడాఫోన్‌ ఐడియాదేనని ఆయన తెలిపారు.

వొడాఫోన్‌ ఐడియా బకాయిలకు బదులుగా ప్రభుత్వం వాటాలు తీసుకోవడం వల్ల స్వల్పకాలిక ఊరట లభించినప్పటికీ కంపెనీ నిలదొక్కుకోవాలంటే యూజర్ల బేస్‌ స్థిరంగా ఉండటం, టారిఫ్‌లను పెంచడం, దీర్ఘకాలిక రుణాల సమీకరణ మొదలైనవి కీలకాంశాలుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి గట్టెక్కినా, భవిష్యత్తులో బాకీల చెల్లింపుల విషయంలో కంపెనీ సవాళ్లు ఎదుర్కొనవచ్చని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగి మద్దతునిస్తుందా అనే సందేహాన్ని మంత్రి నివృత్తి చేశారు. మరోవైపు, బ్యాంక్‌ రుణాల చెల్లింపులో ఎంటీఎన్‌ఎల్‌ డిఫాల్ట్‌ కావడంపై స్పందిస్తూ కంపెనీకి గణనీయంగా స్థలాలు ఉన్నాయని, వాటిని నగదీకరణ చేయడం ద్వారా రుణాలను తీర్చేసే అవకాశం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement