అస్సెట్‌ అలొకేషన్‌ అంటే ఇదేనా..?  | What Is Asset Allocation And Why Is It Important? | Sakshi
Sakshi News home page

అస్సెట్‌ అలొకేషన్‌ అంటే ఇదేనా..? 

Published Mon, Dec 25 2023 7:11 AM | Last Updated on Mon, Dec 25 2023 7:17 AM

What Is Asset Allocation And Why Is It Important? - Sakshi

నా దగ్గరున్న మొత్తంలో 60 శాతాన్ని బ్యాంకు ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్‌ చేశాను. మిగిలిన 40 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఈక్విటీ పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఈక్విటీలకు 50 శాతం, ఎఫ్‌డీల్లో 50 శాతం ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. అస్సెట్‌ అలొకేషన్‌ అంటే.. 50 శాతం మించి ఈక్విటీలలో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోకి మళ్లించడమేనా?  – ఎస్‌కే సిన్హా 

అస్సెట్‌ రీబ్యాలన్స్‌ అంటే ఒక లకి‡్ష్యత కేటాయింపుల విధానాన్ని అనుకుని.. ఆ మేరకు పెట్టుబడుల మొత్తాన్ని వివిధ పెట్టుబడి సాధనాల మధ్య వర్గీకరించడం. ఒకే కాల వ్యవధిలో కొన్ని సాధనాలు మంచి పనితీరు చూపించడం వల్ల వాటిల్లోని పెట్టుబడుల విలువ ఇతర సాధనాలతో పోలిస్తే గణనీయంగా పెరగొచ్చు. దీంతో అలా మంచి పనితీరు చూపించిన వాటి వెయిటేజీ పెరిగిపోతుంది. అప్పుడు ముందు అనుకున్న కేటాయింపులకు మించి, ఎంత అయితే పెరిగిందో ఆ మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పోర్ట్‌ఫోలియోలో వెయిటేజీ పడిపోయిన సాధనాలకు ఆ మేరకు కేటాయింపులు పెంచుకోవాలి.

అస్సెట్‌ రీబ్యాలన్సింగ్‌ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. మీ రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడుల మధ్య సమతూకాన్ని కొనసాగించుకునే వెసులుబాటు ఈ విధానంతో వస్తుంది. అంటే ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్‌ అలొకేషన్‌ విధానాన్ని నిర్ణయించుకున్నారని అనుకుందాం. కొంత కాలం తర్వాత మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80 శాతానికి చేరి డెట్‌ పెట్టుబడులు 20 శాతానికి తగ్గాయని అనుకుంటే.. అప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఉద్దాన, పతనాల ప్రభావం పెట్టుబడుల విలువపై ప్రతిఫలిస్తుంటుంది. ఇది పెట్టుబడిదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్కువ రిస్క్‌ తీసుకోవద్దని అనుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీల పెట్టుబడులను 60 శాతానికి తగ్గించుకుని, డెట్‌ పెట్టుబడులు 40 శాతానికి అస్సెట్‌ రీఅలొకేషన్‌తో పెంచుకోవడం వల్ల తిరిగి వారి విధానానికి తగ్గట్టు పెట్టుబడుల స్వరూపం ఉంటుంది.

అస్సెట్‌ రీబ్యాలన్సింగ్‌తో ఉన్న మరొక ప్రయోజనాన్ని చూస్తే.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం. ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగిందంటే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్‌ రీఅలొకేషన్‌ విధానంలో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం.  తరచుగా కాకుండా.. ఏడాదికోసారి లేదంటే.. ఒక పెట్టుబడి సాధనంలోని పెట్టుబడుల విలువ నిర్దేశిత పరిమితి కంటే 5 శాతానికి మించి పెరిగిపోయిన సందర్భాల్లోనే దీన్ని చేయడం సూచనీయం.  
నా వయసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంపిక చేసుకోవాలా? – భాస్కర్‌  

ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకున్న అనుభవం ఏ మేరకు? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్‌ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే మొత్తం నుంచి ఆదాయం కోరుకోకుండా, పెట్టుబడి కోసమే అయితే అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement