వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్ | Warren Buffett Timeless Rules for Mutual Fund Investors in Volatile Markets | Sakshi
Sakshi News home page

వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్

Apr 24 2026 12:32 PM | Updated on Apr 24 2026 12:42 PM

Warren Buffett Timeless Rules for Mutual Fund Investors in Volatile Markets

మ్యూచువల్ ఫండ్స్ అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. అదే సమయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. సరైన ఫండ్‌ను ఎంచుకోవడానికి మేధావి అయి ఉండాలని, మార్కెట్ గమనాన్ని ప్రతిరోజూ గమనించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే వారెన్ బఫెట్ సిద్ధాంతాలు దీనికి భిన్నంగా ఉంటాయి. 94 ఏళ్ల వయసులోనూ బెర్క్‌షైర్ హాత్వేను విజయపథంలో నడిపిస్తున్న ఆయన పెట్టుబడి అనేది విజ్ఞానం కంటే కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవహారమని నమ్ముతారు. నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలిచే బఫెట్ సూత్రాలపై ప్రత్యేక కథనం.

పెట్టుబడి కాల పరిమితి

‘ఒకవేళ స్టాక్ మార్కెట్ పదేళ్లపాటు మూతపడినా మీరు నష్టపోని కంపెనీలనే ఎంచుకోవాలి’ అన్నది బఫెట్ నియమం. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తరచుగా ఫండ్లను మార్చడం వల్ల చక్రవడ్డీ లాభాన్ని కోల్పోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌ను ఎంచుకుని దానికి దశాబ్దాల పాటు కట్టుబడి ఉండటమే అసలైన విజయం.

మేధస్సు కంటే క్రమశిక్షణ ముఖ్యం

పెట్టుబడి పెట్టడానికి ఐక్యూ 160 ఉండాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే చాలని బఫెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా పెరిగినప్పుడు అత్యాశ చెందకుండా సిప్‌లను కొనసాగించడమే అత్యుత్తమ వ్యూహం.

రోజూ మార్కెట్‌ను గమనించకండి

స్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉన్న వ్యక్తి నుంచి ఓపికగా ఉన్న వ్యక్తికి డబ్బు బదిలీ చేసే సాధనం అని బఫెట్ నమ్ముతారు. రోజూ మ్యుచువల్‌ ఫండ్‌ ఎన్‌ఏవీని చూడటం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత అయితే నేటి మార్కెట్ ఒడిదుడుకులు మీకు అనవసరం.

భయం, అత్యాశల సమతుల్యత

ప్రజలందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశగా ఉండండి - ఇది బఫెట్ లైఫ్ మంత్రం. మార్కెట్ కుప్పకూలినప్పుడు చాలామంది సిప్‌లు ఆపేస్తారు. కానీ, అప్పుడే యూనిట్లు తక్కువ ధరకు వస్తాయనే విషయాన్ని బఫెట్ గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో చేసే అదనపు పెట్టుబడి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది.

తెలియనిచోట పెట్టుబడి వద్దు

ఏదో ఒక సెక్టోరల్ ఫండ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది 50% రిటర్న్స్ ఇచ్చిందని అందులో డబ్బులు పోయడం ప్రమాదకరం. ఆ ఫండ్ రిస్క్ ఏంటి? దాని వ్యూహం ఏంటి? అనేది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.

అంచనాలపై ఆధారపడకండి

మార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వచ్చే నెల ఎలా ఉంటుంది? అనే అంచనాలు జ్యోతిష్యం లాంటివే తప్ప వాస్తవాలు కావని బఫెట్ అభిప్రాయపడతారు. గత ఆరు నెలల ర్యాంకింగ్ చూసి ఫండ్లను మార్చడం కాకుండా ఫండ్ హౌస్ విశ్వసనీయతను చూసి పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తారు.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
 
Advertisement
Advertisement