యూఎస్‌కు నాన్‌స్టాప్‌ ఫ్లైట్స్‌: విస్తారా కన్ను

Vistara plans Nonstop flights to US - Sakshi

ఎప్పటిలోగా ప్రారంభించాలనే అంశంపై కసరత్తు

విమానాల ఆవశ్యకతపైనా ప్రణాళికలు

డెరైక్ట్‌ సర్వీసుల ప్రారంభంపై వివిధ పరిశీలనలు

కోవిడ్‌-19 నేపథ్యంలో నాన్‌స్టాప్‌ సర్వీసులకు డిమాండ్‌

ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా విమానాల సంఖ్య 70కు

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్‌ సంస్థ విస్తారా.. యూఎస్‌కు నాన్‌స్టాప్‌ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్‌కు డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ నేపథ్యంలో నాన్‌స్టాప్‌ సర్వీసులకు భారీ డిమాండ్‌ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వినోద్‌ కన్నన్‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

20-30 శాతం వరకూ
నాన్‌స్టాప్‌ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్‌ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top