బ్యాంకింగ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు నష్టాలు

US banking crisis will impact India - Sakshi

అమెరికా బ్యాంకింగ్‌ సంక్షోభ ప్రభావం

6 శాతం వరకు నష్టపోయిన పథకాలు

న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్‌ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్‌ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్‌ స్టాక్స్‌ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి.  

ప్రభావం పెద్దగా ఉండదు..
కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్‌ రంగ మ్యూచువల్‌ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్, టాటా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్, నిప్పన్‌ ఇండియా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్‌ ఫండ్స్‌ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top