యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ | UPI transactions to face charges Finance Ministry issues clarification | Sakshi
Sakshi News home page

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Jun 11 2025 8:25 PM | Updated on Jun 11 2025 8:51 PM

UPI transactions to face charges Finance Ministry issues clarification

యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో పలు కథనాలు వచ్చాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.

మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..
మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్‌లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్‌పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement