Union Budget 2023-24: బడ్జెట్ కేటాయింపుల్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో ఇదే తక్కువ..

Union Budget 2023-24 Mgnrega Allocation Lowest In Last 4 Years - Sakshi

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ).. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకుంది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో కేటాంపులను భారీగా తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించారు.

గతేడాది సవరించిన అంచనా కేటాయింపు రూ.89,400 కోట్లలో ఏకంగా 32 శాతం తగ్గించింది. 2022-23 బడ్జెట్‌లో కూడా మోదీ సర్కార్‌  25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది.

ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలు వలసలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో 2005లో నాటి కాంగ్రెస్‌  ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. 

గత నాలుగు బడ్జెట్లలో కేటాయింపులు ఇలా..
మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఎలా తగ్గిస్తోందో గత నాలుగు బడ్జెట్లలో ఈ పథకానికి చేసిన కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. 2020-21 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కారు 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.60వేల కోట్లు. గత నాలుగు బడ్జెట్లలో ఇదే అత్యల్ప కేటాయింపు కావడం గమనార్హం.
చదవండి: బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top