రూపీ రూబుల్‌ పేరు చెప్పి చైనీస్‌ యువాన్‌తో కానిచ్చేశారేంటీ!?

UltraTech Cement paying for Russian coal in Chinese Yuan - Sakshi

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంతో మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో వ్యాపార సంబంధాలు యూఎస్‌ డాలర్లలో కాకుండా ఇండియన్‌ రూపీ, రష్యా రూపీలతో జరిపేందుకు సన్నహకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా రష్యా నుంచి ఇండియాకు వస్తున్న  ఓ బొగ్గు రవాణా ఒప్పందం రూపీ రూబుల్‌  ప్రయత్నాలకు చిన్న ఝలక్‌ ఇచ్చినట్టయ్యింది.

ఇండియాలో అతి పెద్ద సిమెంట్‌ బ్రాండ్‌గా పేరొందిన ఆల్ట్రాటెక్‌ ఓ వివాస్పద నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆల్ట్రాటెక్‌ రష్యా నుంచి భారీ ఎత్తున బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్‌ 5న ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రష్యా బొగ్గు కొనుగోలు కోసం ఎప్పటి లాగే యూఎస్‌ డాలర్లలోనూ లేదా ఇండియన్‌ రూపీలతో కాకుండా చైనీస్‌ కరెన్సీ యూవాన్లలో చెల్లించింపులు చేసినట్టు తెలుస్తోంది.

ఈ దిగుమతి డీల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాల ప్రకారం రష్యా నుంచి 1,57,000 టన్నుల బొగ్గును అల్ట్రాటెక్‌ దిగుమతి చేసుకుంటోంది. ఈ డీల్‌కు సంధానకర్తగా దుబాయ్‌కి చెందిన సుయెక్‌ సంస్థ వ్యవహరించింది. తూర్పు రష్యాలోనే వానినో పోర్టు నుంచి మన దగ్గర కాండ్లా పోర్టుకు ఈ బొగ్గు రవాణా కానుంది. లక్షా యాభై ఏడు వేల టన్నుల బొగ్గు కొనుగోలు కోసం ఆల్ట్రాటెక్‌ 172,652,900 యూవాన్లు (25.81 మిలియన్లు) చెల్లించినట్టుగా ఉంది.

గడిచిన ఇరవై ఏళ్లలో రష్యాతో జరిపే లావాదేవీల్లో ఇండియన్‌ కంపెనీలు చైనీస్‌ కరెన్సీలో చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని అంతర్జాతీయ వ్యవహరాలను పరిశీలించే నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల్లో చైనీస్‌ యూవాన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డాలర్‌కు సమాంతరంగా యూవాన్‌ ఎదిగేందుకు అవకాశం ఉంది.

ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో డాలర్‌కు ప్రత్యామ్నయంగా ఇతర కరెన్సీలో లావాదేవీలు జరిపేందుకు రష్యా కూడా సముఖంగానే ఉంది. దీంతో రూపీ - రూబుల్‌ లావాదేవీల అంశం తెరపైకి వచ్చింది. ఇదింకా చర్చల దశలో ఉండగానే రూబుల​ - యువాన్‌ సంబంధం గట్టిపడటం అనేది మన విదేశాంగ విధానానికి కొంత వరకు మింగుడుపడని అంశమనే భావన నెలకొంది.

చదవండి: కమర్షియల్‌ బొగ్గు గనుల వేలం..బిడ్స్‌ దాఖలు చేసిన 31 సంస్థలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top