భారతీయ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ రంగంలో 85 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ‘క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్’ (సీజీసీఈఎల్) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం సాంప్రదాయ ఫ్యాన్లు, మోటార్ పంపుల తయారీ సంస్థగానే కాకుండా సమగ్ర గృహ పరిష్కారాలను అందించే సాంకేతిక దిగ్గజంగా అవతరించేందుకు ‘క్రాంప్టన్ 2.0’ వ్యూహంతో సమగ్ర మార్పులకు పూనుకుంది.
ముంబైలోని విఖ్రోలిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రమీత్ ఘోష్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తన్మయ్ ప్రుష్టి, సీఎఫ్ఓ కాళీశ్వరన్ అరుణాచలం, అనుబంధ సంస్థ బటర్‌ఫ్లై చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్వేత సాగర్‌లతో కలిసి తమ నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించారు. కొత్త ఉత్పత్తుల విడుదలలో భాగంగా కంపెనీ అనుబంధ విభాగం ‘రియాన్’ను ఆవిష్కరించారు. ఈ విభాగంలో భారత్‌లోనే మొదటిసారి వాటర్ బయోఫ్యూరిఫైర్ ‘బయోఫైర్’ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మారుతున్న భారతీయుల జీవనశైలి, ఆధునిక అభిరుచులకు అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో (FY31 నాటికి) వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం సుమారు రూ.8,000 కోట్ల నుంచి రెండింతలు పెంచి రూ.15,000 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది.
రూ.1.6 లక్షల కోట్లకు..
కంపెనీ సీఈఓ ప్రమీత్ ఘోష్ చెప్పిన వివరాల ప్రకారం.. గత మూడేళ్ల కాలంలో క్రాంప్టన్ తన వ్యాపార పరిధిని గణనీయంగా విస్తరించింది. మూడేళ్ల క్రితం కంపెనీకి ఉన్న మొత్తం అడ్రసబుల్ మార్కెట్ (టీఏఎం) పరిమాణం రూ.80,000 కోట్లు కాగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.1,60,000 కోట్లకు చేరింది. కొత్తగా సోలార్ రూఫ్‌టాప్స్, సోలార్ వాటర్ పంప్‌లు, ఎలక్ట్రికల్ వైర్లు, రూ.5,500 కోట్లకు పైగా విలువైన వాటర్ ప్యూరిఫికేషన్ (నీటి శుద్ధి) విభాగాలు ఈ మార్కెట్ విస్తరణకు ప్రధాన చోదకాలుగా నిలిచాయి.
ప్రీమియమైజేషన్ వైపు అడుగులు.. క్రాంప్టన్ రియాన్
సాధారణ వినియోగదారులతోపాటు కంపెనీ ఇప్పుడు సూపర్ ప్రీమియం కేటగిరీ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘క్రాంప్టన్ రియాన్’ అనే ప్రీమియం సబ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. రియాన్ పోర్ట్‌ఫోలియో కింద దేశంలోనే మొదటిసారిగా ‘వాటర్ బయోఫైయర్’ అనే సుమారు రూ.42,000 విలువైన వాటర్ ప్యూరిఫైయర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. శక్తివంతమైన బ్రష్‌లు లేని డైరెక్ట్ కరెంట్ మోటారు(బీఎప్‌డీసీ) ఫ్యాన్లలో ‘ఎనర్జియాన్’ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేస్తూ మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది.
నూతన బ్రాండ్ ఐడెంటిటీ
మారుతున్న వినియోగదారుల ట్రెండ్స్‌కు అనుగుణంగా క్రాంప్టన్ తన విజువల్, సోనిక్ ఐడెంటిటీని పునర్నిర్మిస్తున్నట్లు కంపెనీ సీఈఓ చెప్పారు. ఇందులో భాగంగానే సరికొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ‘అమేజింగ్, ఎవ్రీ డే’ అనే దీని ట్యాగ్‌లైన్‌ను ప్రకటించారు. ఈ బ్రాండ్ మార్పుల కోసం 18,000 మందికి పైగా వినియోగదారులు, 30 మిలియన్ల డేటా పాయింట్లతో దాదాపు 18 నెలల పాటు విస్తృతమైన పరిశోధన చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
ఆవిష్కరణలే కీలకం
పరిశోధన, ఆవిష్కరణల కోసం గత మూడేళ్లలో రూ.312 కోట్లు వెచ్చించగా, గతేడాదే రూ.112 కోట్లను కేటాయించినట్లు సీఈఓ చెప్పారు. ‘సుస్థిర ఇంధన విభాగంలో సోలార్ రూఫ్‌టాప్స్, పంపుల్లో స్థిరమైన వృద్ధి సాధిస్తోంది. ఇటీవలే మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుంచి రూ.101 కోట్ల భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మెరుగైన ఫలితాలను కనబరిచింది’ అన్నారు.
ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..


