Top 5 Best Electric Scooters Price Range and Details - Sakshi
Sakshi News home page

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? టాప్ 5 స్కూటర్స్ ఇవే!

Published Sun, May 7 2023 12:42 PM

Top five best electric scooters price range and details - Sakshi

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తారా స్థాయిలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలన్నీ ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి వివరాలేంటి అనే మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.

ఓలా ఎస్1
భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన 'ఎస్1 ప్రో' ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఈ స్కూటర్ ధర ఈ 99,999. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీల ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. ఇది 2.98 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 121 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్
టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్' ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 1.05 లక్షలు. ఇందులో 3.04 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్‌తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు. టీవీఎస్ ఐక్యూబ్ 5 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

ఏథర్ 450ఎక్స్
బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన ఏథర్ మార్కెట్లో '450ఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.17 లక్షల నుంచి రూ. 1.39 లక్షలు మధ్య ఉంది. ఇందులోని 2.23 కిలోవాట్ బ్యాటరీ 70 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 80 కిమీ కాగా, ఛార్జింగ్ టైమ్ 5.45 గంటలు.

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్
రూ. 72,240 వద్ద లభిస్తున్న హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ మార్కెట్లోని ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది 1.87 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 108 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ స్కూటర్ చాలా అద్భుతంగా ఉంటుంది.

బజాజ్ చేతక్
బజాజ్ ఆటో భారతదేశంలో విక్రయిస్తున్న 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఒక ఛార్జ్‌తో 85 నుంచి 95 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్లో 3 కిలోవాట్ బ్యాటరీ నిక్షిప్తమై ఉంటుంది. ఇది 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు మాత్రమే.

(ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో)

ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి, కావున ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు తప్పకుండా ఆ రాష్ట్రంలో అందించే సబ్సిడీ, ఇతర వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Advertisement
Advertisement