ఇన్‌కంట్యాక్స్‌ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు

These Are The Ways To Get Exemption From Income TaX - Sakshi

వ్యాపారం ఎంతో రిస్క్‌తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని..
 
టర్మ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ పాలసీ
అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్‌ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్‌ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్‌ ప్రధానమైంది. ఇన్సురెన్స్‌ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌
చట్టపరంగా ఇన్‌కంట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్‌డ్రా చేయడానికి వీలులేదు.

ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌
ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో  ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్‌ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్‌ ఉంటాయి. సీనియర్‌ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్‌ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం
అరవై ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top